కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఇద్దరి పేర్లు పరిశీలన

August 09, 2019


img

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏనాడూ ఎదుర్కోనివిధంగా తొలిసారిగా నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత సోనియా లేదా ప్రియాంకా వాద్రాలలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు ఒత్తిడి చేశారు కానీ వారు కూడా వ్యక్తిగత కారణాలతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించడంతో నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తికి పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం లభించబోతోంది. శనివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగనుంది. దానిలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఆ పదవి చేపట్టడానికి పార్టీలో సీనియర్లు సైతం జంకుతున్నారు. ఇప్పటివరకు అనేక పేర్లు వినబడినప్పటికీ చివరిగా సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, ముకుల్ వాస్నిక్ లలో ఎవరో ఒకరిని పార్టీ నూతన అధ్యక్షుడుగా రేపు ఎన్నుకోబోతున్నట్లు తాజా సమాచారం. 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టడం అంటే ముళ్ళకిరీటం ధరించి ముళ్ళ సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నట్లే లెక్క. ఒకపక్క అప్రతిహాతంగా దూసుకుపోతున్న బిజెపిని ఎదుర్కొంటూనే, దేశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ బలోపేతం చేసుకొని వివిద రాష్ట్రాలలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్దం చేసి విజయపదంలో నడిపించాల్సి ఉంటుంది. ఇదిగాక సోనియా, రాహుల్, ప్రియాంకాలకు విధేయంగా వ్యవహరించాలి. వారు ముగ్గురినీ తప్ప వేరెవరినీ ఖాతరు చేసే అలవాటులేని కాంగ్రెస్‌ నేతలపై పట్టు సాధించాలి. ఎన్నికలలో పార్టీని గెలిపించడం కంటే ముందు పార్టీపై పట్టు సాధించడం చాలా కష్టమైన పని. కనుక పార్టీ పగ్గాలు ఎవరు అందుకున్నా వారికి నిత్యం అగ్నిపరీక్షలు ఎదుర్కోక తప్పదు. మరి ఈ ముళ్ళ కిరీటం ఎవరి నెత్తిన పెట్టుకుంటారో చూడాలి.


Related Post