బిజెపిలోకి వివేక్..మరి కోమటిరెడ్డి ఎప్పుడో?

August 09, 2019


img

మాజీ ఎంపీ జి.వివేక్ ఈరోజు డిల్లీలో అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, కేంద్రసహాయమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యదర్శి రాంమాధవ్. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కొద్ది రోజుల క్రితమే టచ్చులోకి వచ్చిన జి.వివేక్‌ను పార్టీలో చేర్చేసుకున్న బిజెపి, గత 2-3 నెలల నుంచి బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్న మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇంతవరకు పార్టీలో ఎందుకు చేర్చుకోలేదో తెలియదు. కానీ రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడం ఖాయమని, కేవలం సాంకేతిక కారణాల చేత ఆయన చేరిక ఆలస్యం అవుతోందని అని కె.లక్ష్మణ్‌ అన్నారు. అయితే సాంకేతిక కారణాల వలననే ఆలస్యమవుతోందా లేదా భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా తీసుకురావాలని బిజెపి షరతు విదించిందా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకొంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. రేపు డిల్లీలో జరుగబోయే కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర అధ్యక్షులను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ వెంకట్‌రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగడం ఖాయం. ఒకవేళ ఇవ్వకపోతే కోమటిరెడ్డి సోదరులిద్దరూ బిజెపిలో చేరాలని వేచిచూస్తున్నారేమో? ఒకవేళ వెంకట్‌రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే అప్పుడు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగాలా లేక బిజెపిలో చేరి సోదరుడితో యుద్ధం చేయాలా? అని తేల్చుకోవలసి ఉంటుంది. 



Related Post