కాంగ్రెస్‌లో టికెట్ల అమ్మకాలు నిజం: విహెచ్

August 09, 2019


img

మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు పార్టీ రాష్ట్ర అధిష్టానంపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు కొందరు టికెట్లు అమ్ముకొంటున్నట్లు వచ్చిన ఆరోపణలు నిజమని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలలో నేను పోటీ చేస్తానని టికెట్ ఇవ్వాల్సిందిగా కోరాను. కానీ మల్లు భట్టి విక్రమార్క నాకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. నేనేమైనా దొంగనా.. రౌడీనా లేక భూకబ్జాలకు పాల్పడ్డానా టికెట్ నిరాకరించడానికి? ఎమ్మెల్సీ టికెట్ కోసం ఏఐసిసి కార్యదర్శి డబ్బులు అడిగారని పొంగులేటి నాకు చెప్పారు. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చి రాష్ట్రంలో పార్టీని గెలిపించుకొని అధికారంలోకి రావాలని ఆలోచించకుండా టికెట్లు అమ్ముకోవడం చాలా దారుణం. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం తీరు సరిగా లేదు. ఈలెక్కన నేను కూడా పార్టీ విడిచిపెట్టివెళ్ళక తప్పదేమో? ఈనెల 20 తరువాత నేను కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగాలో వద్దో నిర్ణయించుకొంటాను,” అని అన్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు టికెట్లు అమ్ముకొంటున్నట్లు కొందరు కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సమయంలోనే ఆరోపణలు చేశారు. టికెట్లు దొరకని కొంతమంది నేతలు పార్టీని విడిచిపెట్టివెళ్లిపోగా మరికొందరిని సస్పెండ్ చేసి ఆ సెగలను ఆర్పివేశారు. పార్టీలో అందరికంటే సీనియర్ నేత అయిన వి.హనుమంతరావు ఇప్పుడు అవే ఆరోపణలు చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలకు చాలా ఇబ్బందికరంగా  మారింది. వి.హనుమంతరావు వంటి కాంగ్రెస్‌ వీరవిధేయుడు ఈ వయసులో పార్టీని వీడుతారంటే నమ్మశక్యంగా లేదు. రేపు డిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది కనుక బహుశః దాని దృష్టికి తీసుకువెళ్ళేందుకు నోరు విప్పారేమో? వి.హనుమంతరావు ఆరోపణలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 


Related Post