భారత్‌ పరువు తీస్తున్న యుద్ధవిమానాలు

August 09, 2019


img

పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో తిష్టవేసిన ఉగ్రవాదుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి తిరిగి వచ్చిన మన వాయుసేన ప్రపంచదేశాలలో భారత్‌ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. అదేవిధంగా వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తన పాత మిగ్ విమానంతో అమెరికా తయారు చేసిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చివేసి భారత్‌ వాయుసేన సత్తాను లోకానికి చాటి చెప్పాడు. కానీ అదే వాయుసేన....అవే యుద్దవిమానాలు శిక్షణా సమయంలో పిట్టలు రాలినట్లు కూలిపోతుండటం భారత్‌ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. వాటి యుద్ధసన్నదతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 

ప్రతీ ఏడాది కనీసం ఒకటి రెండు యుద్ధవిమానాలు కూలిపోతుండటం...ఆ ప్రమాదాలలో పైలట్లు ప్రాణాలు కోల్పోవడమో లేదా తీవ్రగాయాలపాలవడం చాలా సాధారణ విషయమైపోయింది. కానీ అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వాయుసేన ఏమైనా చర్యలు తీసుకొందో లేదో తెలియదు కానీ నేటికీ యుద్ధవిమానాలు కూలిపోతూనే ఉన్నాయి. 

తాజాగా గురువారం సాయంత్రం అసోంలోని మిలాన్‌పూర్ అనే గ్రామంలో పంటపొలాలలో వాయుసేనకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం శిక్షణా సమయంలో కూలిపోయింది. అయితే దానిని నడిపిస్తున్న ఇద్దరు పైలట్లు ప్రమాదం పసిగట్టి దానిలో నుంచి బయటపడి పారాచూట్స్  సాయంతో ప్రాణాలు కాపాడుకున్నారు. పంటపొలాలలో కూలిన యుద్ధవిమానం క్షణలాలో మంటలలో దగ్ధం అయ్యింది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఒక పైలట్‌ను తేజ్ పూర్‌లో గల ఆర్మీబేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే మీడియాకు తెలిపారు.

ఇక్కడితో ఈ కధ ముగిసినట్లే. మళ్ళీ మరో యుద్ధవిమానం కూలినప్పుడు మళ్ళీ దర్యాప్తుకు ఆదేశంతో ఇదేవిధంగా ముగుస్తుంది. బహుశః ఈ కధ ఎప్పటికీ ఇలాగే సాగుతుంతుందేమో? దేశాన్ని శత్రువుల బారి నుంచి కాపాడవలసిన యుద్ధవిమానాలు శిక్షణా సమయంలోనే కూలిపోతుంటే నిజంగా యుద్ధం వస్తే ఏవిధంగా పనిచేస్తాయో? అని సామాన్య ప్రజల సందేహపడితే తప్పు లేదు. 


Related Post