తెలంగాణ చరిత్రలో చిన్నమ్మకూ స్థానం ఉంది

August 07, 2019


img

తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించినవారిలో బిజెపి మాజీ ఎంపీ స్వర్గీయ సుష్మా స్వరాజ్ కూడా ఒకరు. తెలంగాణ ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్‌తో సహా పలుపార్టీలు కప్పగంతులు వేస్తూ అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, బిజెపి తరపున తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సుష్మాస్వరాజ్ తమ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని నిర్ద్వందంగా ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటు చేసిన సోనియా గాంధీ ‘పెద్దమ్మ’ అయితే తెలంగాణ సాధనకు సహకరించిన తనను ‘చిన్నమ్మ’గా గుర్తుంచుకోవాలని తెలంగాణ ప్రజలను సుష్మా కోరారు. 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌, నాటి కాంగ్రెస్‌ కేంద్రమంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు, నేతలు ఏవిధంగా డిల్లీలో తమకున్న పరిచయాలను, పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ ఏర్పాటు కోసం తెరవెనుక కృషి చేశారో అదేవిధంగా సుష్మాస్వరాజ్ కూడా తమ పార్టీ పెద్దలను, కాంగ్రెస్‌ పెద్దలను ఒప్పించేందుకు గట్టిగా ప్రయత్నించారు. 

తెలంగాణ ఉద్యమాలలో భాగంగా డిల్లీలో జంతర్ మంతర్, ఏపీ భవన్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమాలలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దానిని అడ్డుకునేందుకు ఆంధ్రా ఎంపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా సుష్మా స్వరాజ్ లేచి నిలబడి తెలంగాణకు అనుకూలంగా తన వాదనలను వినిపించారు. కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసినవారిలో స్వర్గీయ సుష్మా స్వరాజ్ పేరు కూడా తప్పక చెప్పుకోవలసిందే. 


Related Post