బెడిసికొట్టిన కాంగ్రెస్‌ వాదన

August 06, 2019


img

కేంద్రప్రభుత్వం కశ్మీర్‌కు సంబందించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రాన్ని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో నోరుజారి బిజెపి సభ్యులకు అడ్డంగా దొరికిపోయింది. కాంగ్రెస్‌ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మంగళవారం లోక్‌సభలో తన వాదనలు వినిపిస్తూ, “1948 నుంచి ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఉన్న కశ్మీర్‌, భారత్‌ అంతర్గత వ్యవహారం ఎలా అవుతుంది? మనం సీమ్లా అగ్రిమెంట్, లాహోర్ డిక్లరేషన్లపై సంతకాలు చేసినప్పుడు కశ్మీర్ అంశం అంతర్గత వ్యవహారం అవుతుందా లేక ద్వైపాక్షిక వ్యవహారం అవుతుందా? అని నేను, నా పార్టీ (కాంగ్రెస్‌) తెలుసుకోవాలనుకొంటున్నాము,” అని అన్నారు.

ఆయన మాటలు విని సోనియా గాంధీ సైతం షాక్ అయ్యారు. ఎందుకంటే గత ఏడు దశాబ్ధాలుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్తో పాటు అన్ని ప్రభుత్వాలు కశ్మీర్ భారత్‌లో అంతర్గతభాగమని, దానిపై ఐక్యరాజ్యసమితితో సహా ఎవరి ప్రమేయాన్ని సహించబోమని, ఎవరి మద్యవర్తిత్వాన్ని అంగీకరించబోమని ఖరాఖండీగా చెపుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ వ్యవహారంలో వేలుపెట్టేందుకు ప్రయత్నించినప్పుడు కూడా భారత్‌ నిర్ద్వందంగా తిరస్కరించింది. కానీ కాంగ్రెస్‌ ఎంపీ కశ్మీర్ ఐక్యరాజ్యసమితి పరిధిలో ఉన్న ద్వైపాక్షిక వ్యవహారమని అనడంతో, ఆవిధంగా వాదిస్తున్న పాకిస్థాన్‌ వాదనలను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సాక్షిగా దృవీకరించినట్లయింది.దీంతో ఇంతవరకు కశ్మీర్‌ బిల్లులపై తీవ్రంగా ఎదురుదాడి చేస్తున్న కాంగ్రెస్‌ సభ్యులు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు. సభలోనే ఉన్న సోనియాగాంధీ సదరు కాంగ్రెస్‌ ఎంపీని తీవ్రంగా మందలించారు.

ఇదే అదునుగా కేంద్రహోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌ సభ్యులపై ఎదురుదాడి చేస్తూ, “కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని మీ పార్టీ భావిస్తోందా లేక ద్వైపాక్షిక సమస్య అని భావిస్తోందా? మీ పార్టీ వైఖరి  చెప్పాలంటూ,” గట్టిగా నిలదీశారు.


Related Post