కాంగ్రెస్‌ బలహీన క్షణాలలో కీలక బిల్లులు ఆమోదం

August 06, 2019


img

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని ఇప్పటికీ నెలరోజులు పైనే అవుతోంది. కానీ ఇంతవరకు ఆయన స్థానంలో ఎవరినీ అధ్యక్షుడిగా ఎన్నుకోలేకపోయింది. కనుక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేవరకు తాత్కాలిక అధ్యక్షుడిగా 90 ఏళ్ళు వయసున్న మోతీలాల్ వోరాను నియమించుకొంది. అయితే ఆయన పేరుకే అధ్యక్షుడు కనుక నరేంద్రమోడీ ప్రభుత్వం పార్లమెంటులో ఒకదాని తరువాత మరొకటి చొప్పున చకచకా ప్రవేశపెడుతున్న కీలక బిల్లులపై అధికారికంగా స్పందించలేకపోతున్నారు. ఇక ఇంతవరకు ట్రిపుల్‌ తలాక్‌, కశ్మీర్ విభజన, స్వతంత్రప్రతిపత్తి రద్దు తదితర బిల్లులపై సోనియా, రాహుల్ గాంధీలు స్పందించనేలేదు.

కాంగ్రెస్‌ ఎంపీలు గులాం నబీ ఆజాద్ తదితరులు పార్లమెంటులో ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపిస్తున్నప్పటికీ వాటిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేకపోతోంది. అత్యంత కీలకమైన బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టి చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో చాలా బలహీనంగా కనబడుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగియగానే కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తుంటే, నరేంద్రమోడీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు పొడిగిస్తూ కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర వేయించుకొంటోంది. ఈనెల 9న పార్లమెంటు సమావేశాలు ముగియబోతున్నాయి కనుక మరుసటిరోజే అంటే ఆగస్ట్ 10వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

అయితే నెహ్రూ కుటుంబానికి చెందనివారికే పార్టీ బాధ్యతలు అప్పగించాలనే రాహుల్ గాంధీ షరతు కాంగ్రెస్‌ అధిష్టానానికి చాలా ఇబ్బందికరంగా మారింది. లేకుంటే ఈ పాటికి మళ్ళీ సోనియా గాంధీ లేదా ప్రియాంకా వాద్రా కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టి ఉండేవారేమో? కనుక ఆగస్ట్ 10న జరుగబోయే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలోనైనా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోగలదో లేదో చూడాలి.


Related Post