తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ సార్ జయంతి నేడు

August 06, 2019


img

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తొలిదశ ఉద్యమాలనాటికే గుర్తించారు. అయితే ఆనాడే వారు పోరాటాలు ప్రారంభించినప్పటికీ నిర్ధిష్టమైన ఆశయాలు, సిద్దాంతాలు లేకుండా ముందుకు సాగడంతో వాటిని ఆనాటి ఆంద్రాపాలకులు, కొందరు తెలంగాణ నేతలు కలిసి నిర్వీర్యం చేశారు. ఆ పరిణామాలన్నిటినీ చాలా నిశితంగా గమనించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అవసరాలు, వనరులు, లక్ష్యాలు, వాటి సాధన కోసం అనుసరించాల్సిన మార్గాలను చాలా నిర్ధిష్టంగా రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో ఎటువంటి మార్పులు వస్తాయో... రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవవచ్చో దానిలో వివరించారు. 

ఆయన ఒక నిర్ధిష్టమైన కార్యాచరణ, సిద్దాంతం రూపొందించడంతో ప్రజలలో కూడా చైతన్యం కలిగింది. అందుకే ఆనాడు కేసీఆర్‌ తెరాసను స్థాపించి తెలంగాణ సాధనకు నడుం బిగించి పోరాటాలు మొదలుపెట్టినప్పుడు, తెలంగాణ ప్రజలందరూ కులం, మతం, వర్గం, ప్రాంతం, వయసు, పేద ధనిక అనే బేధాలు పట్టించుకోకుండా సుశిక్షితులైన సైనికులలాగ ముందుకు కదిలి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సాధనకు ఒక మార్గం చూపితే, కేసీఆర్‌ ఆ మార్గంలో లక్ష్యం దిశగా ప్రజలను నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగారు. 

ఆగస్ట్ 6వ తేదీ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ కవిత ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.         

‘‘పుట్టుక మీది.. చావు మీది.. బతుకు తెలంగాణది’’ అని కేటీఆర్‌ ట్వీట్ చేయగా, ‘‘మహాత్మా మీరు చూపిన తోవలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు పునరంకితమవుతాం’’ అని కవిత ట్వీట్ చేశారు.


‘‘మహాకవి కాళోజి చెప్పినట్టుగా పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అన్నట్టు జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహామనిషి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపి బంగారు తెలంగాణకు మార్గదర్శనం చేసిన మహాత్మా శ్రీ కొత్తపల్లి జయశంకర్ సారుకు నివాళులు’’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు. 


Related Post