హరీష్‌రావు సేవలు చింతమడకకే పరిమితమా?

August 06, 2019


img

ఇటీవల సిఎం కేసీఆర్‌ చింతమడక గ్రామంలో పర్యటించినపుడు గ్రామ ప్రజలందరికీ వైద్య పరీక్షలు, అవసరమైనవారికి చికిత్సలు చేయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హరీష్‌రావు సోమవారం చింతమడకలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో యశోదా ఆసుపత్రి వైద్యులు గ్రామప్రజలకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తారని హరీష్‌రావు చెప్పారు. త్వరలోనే దంత, నేత్ర వైద్యశిబిరాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. చింతమడకలో ప్రారంభించిన ఈ పధకాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు, అనుమతులు సాధించుకు రావడంలో, ప్రాజెక్టుల భూసేకరణలో... ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా కీలకపాత్ర పోషించిన మాజీ సాగునీటిశాఖా మంత్రి హరీష్‌రావు, గత ఆరునెలలుగా సిఎం పర్యటనలకు ఏర్పాట్లు చేయడానికి లేదా ఇటువంటివేవో ప్రారంభోత్సవాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుండటం చూస్తే ఆయన అభిమానులకు బాధ కలుగకమానదు. అటువంటి సమర్దుడు, కార్యదక్షుడు, పార్టీ విధేయుడి సేవలను ప్రభుత్వం ఎందుకు ఉపయోగించుకోకపోవడం లేదో తెలియదు కానీ తద్వారా సిఎం కేసీఆర్‌ ఆయనను పక్కన్న పెట్టారనే భావన ప్రజలకు కలుగుతోందని చెప్పకతప్పదు.


Related Post