కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు

August 05, 2019


img

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌ మరియు లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజనాకు, అలాగే జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. స్వతంత్ర ప్రతిపత్తి రద్దు బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. తెరాస, వైసీపీ, టిడిపి, బీఎస్పీ, బిపిఎఫ్, శివసేన, అకాలీదళ్, ఆమాద్మీ పార్టీలు బిల్లుకు మద్దతునీయగా కాంగ్రెస్, పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్, జనతాదళ్ (యు), ఆర్జేడి, టిఎంసి, డిఎంకె, ఎండిఎంకె, సిపిఎం పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఎన్సీపీ, జేడియులు ఓటింగుకు దూరంగా ఉండటం ద్వారా పరోక్షంగా బిల్లు ఆమోదానికి సహకరించాయి.

ఈ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలుపడంతో అమిత్ షా వెంటనే లోక్‌సభలో దానిని ప్రవేశపెట్టారు. మంగళవారం దీనిపై లోక్‌సభలో చర్చించి ఆమోదముద్ర వేస్తారు. లోక్‌సభలో మోడీ సర్కారుకు పూర్తి మెజారిటీ ఉంది కనుక లోక్‌సభ ఆమోదముద్ర కేవలం లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ బిల్లుకు రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది కనుక ఈ బిల్లు చట్టరూపం దాల్చడం కూడా లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. అత్యంత వివాదాస్పదమైన ఈ బిల్లును మోడీ సర్కార్ ఇంత సులువుగా పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించుకోవడం విశేషమే.

దీనిపై జమ్ముకశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి నేతలు, చివరికి పాక్‌ ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లయితే ఇకపై త్రివర్ణ పతాకాన్ని మోయబోమని జమ్ముకశ్మీర్‌ మాజీ సిఎం మహబూబా ముఫ్తీ ఇదివరకే ప్రకటించారు. కనుక జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు వాటి నేతలు దీనిపై ఏమి చేయబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది.


Related Post