కాంగ్రెస్‌ రాజకీయ ఆత్మహత్య చేసుకొంటోందా?

August 05, 2019


img

జమ్ముకశ్మీర్‌ విభజన, ప్రత్యేకహక్కుల ఉపసంహరణపై కేంద్రం నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్‌లోని ప్రాంతీయ పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాటివలన వారికి రాజకీయంగా నష్టం కలుగుతుంది. వారు సానుభూతి చూపుతున్న వేర్పాటువాదులకు ఆగ్రహం కలుగుతుంది. కనుక వారు వ్యతిరేకించడం సహజమే. కానీ ఈ కశ్మీర్ అగ్గిని రాజేసి రావణకష్టంగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆ కశ్మీర్‌ మంటలలో నుంచి పుట్టినవే కార్గిల్, యూరీ, పఠాన్ కోట్, పుల్వామా దాడులు. వాటితో యావత్ దేశం పలుమార్లు యుద్ధం అంచులవరకు వెళ్ళడం అందరికీ తెలుసు.

దేశభద్రతకు పెనుసవాలుగా మారిన ఈ కశ్మీర్ సమస్యను శాశ్వితంగా పరిష్కరించడానికి ప్రధాని నరేంద్రమోడీ చాలా ధైర్యంగా ముందడుగు వేశారని చెప్పవచ్చు. జమ్ముకశ్మీర్‌ను భౌగోళికంగా పునర్విభజన చేసి, దాని ప్రత్యేక చట్టాలను రద్దు చేయడం ద్వారా కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడదీయడానికి పాక్‌ పాలకులు చేస్తున్న కుట్రలకు ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.

కాంగ్రెస్ పార్టీ రగిల్చిన కశ్మీర్ అగ్గిని ఆర్పివేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ అభినందించకపోయినా పరువాలేదు కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వ్యతిరేకిస్తూ రాజకీయంగా ఆత్మహత్య చేసుకొంటోందని చెప్పవచ్చు. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ, కశ్మీర్ విషయంలో ఇప్పుడు అనుసరిస్తున్న వైఖరితో దేశ ప్రజలకు మరింత దూరం కావడం తధ్యం. దేశసమగ్రత, భద్రత కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే పార్టీయే కనబడకుండా పోయే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిది.


Related Post