మూడు ముక్కలు కానున్న జమ్ముకశ్మీర్‌

August 05, 2019


img

దశాబ్ధాలుగా సలుపుతున్న కాశ్మీర్ పుండుకు నరేంద్రమోడీ ప్రభుత్వం శాశ్వితపరిష్కారం కనుగొనేందుకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రయత్నాలలో భాగంగా జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్ము, కశ్మీర్ అనే రెండు వేర్వేరు రాష్ట్రాలుగా...పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉండే లడ్డాక్ ప్రాంతాన్ని కేంద్రపాలితప్రాంతంగా ఏర్పాటుచేయబోతున్నట్లు తాజా సమాచారం. 

జమ్ముకశ్మీర్‌కున్న స్వతంత్ర ప్రతిపత్తిహోదాను రద్దుచేయబోతున్నట్లు సమాచారం.  దానిని రద్దు చేసినట్లయితే దేశంలో మిగిలిన రాష్ట్రాలలో ఎటువంటి వ్యవస్థలు, చట్టాలు అమలులో ఉంటాయో అటువంటివే అమలుచేయడం సాధ్యం అవుతుంది. కానీ జమ్ముకశ్మీర్‌ ఒకే రాష్ట్రంగా ఉన్నంతకాలం దాని స్వతంత్ర ప్రతిపత్తిహోదాను రద్దుచేయడం సాధ్యం కాదు కనుక రాష్ట్ర విభజన చేయడం ద్వారా హోదాను రద్దు చేయాలనేది కేంద్రం ఆలోచన కావచ్చు.

స్వతంత్ర ప్రతిపత్తిహోదాను అడ్డం పెట్టుకొని వేర్పాటువాదులు, ఉగ్రవాదులు వారికి మద్దతు పలికే ప్రాంతీయపార్టీలు కశ్మీర్‌లో ఒక అరాచకవ్యవస్థను సృష్టించారు. శ్రీనగర్‌లో మువ్వన్నెల జెండా ఎగురవేయాలంటే ప్రాణం మీద ఆశ వదులుకోవలసిందేనంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. స్థానిక రాజకీయపార్టీలు, వాటి నేతలు వేర్పాటువాదుల కనుసన్నలలో పనిచేస్తుండటంతో కశ్మీర్ మెల్లమెల్లగా భారత్‌ చేతిలో నుంచి జారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కశ్మీర్‌ అభివృద్ధికి ఖర్చు చేయవలసిన వేలకోట్లు అది చేజారిపోకుండా కాపాడుకోవడానికి ఖర్చు చేయవలసి వస్తోంది. 

కశ్మీర్‌లో నెలకొన్న ఈ అరాచక వాతావరణం పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు కశ్మీర్‌ను ఒక అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే అవకాశం కల్పిస్తోంది. కనుక జమ్ముకశ్మీర్‌లో దశాబ్ధాలుగా నెలకొన్న ఈ అరాచక వ్యవస్థను సరిచేయడానికి కేంద్రప్రభుత్వం కటినమైన నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదు. 

జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పిఎంకె పార్టీల అధినేతలు, పార్టీ ముఖ్య నేతలు కేంద్రప్రభుత్వం చేయబోతున్న ఈ ప్రయత్నాలను తిప్పికొడతామని నిన్న గట్టిగా హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తచర్యగా నిన్న రాత్రి నుంచి కేంద్రబలగాలు వారినందరినీ గృహనిర్బందంలో ఉంచాయి. నిన్న అర్ధరాత్రి నుంచి జమ్ముకశ్మీర్‌ రాష్ట్రమంతటా నిషేధాజ్ఞాలు విధించింది. ఇప్పటికే రాష్ట్రంలో సమస్యాత్మకంగా ఉండే ప్రాంతాలలో కేంద్రప్రభుత్వం అదనపు బలగాలను మోహరించిన సంగతి తెలిసిందే.    

మరికొద్దిసేపటిలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశం జరుగనుంది. దానిలో జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదముద్ర వేసి, ఈరోజే దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలలో చాలా పార్టీలు దానిని వ్యతిరేకించే అవకాశం ఉంది.


Related Post