భారత్‌ ఆర్ధిక వ్యవస్థ మునిగిపోకుండా ఇంకా తేలుంది!

August 03, 2019


img

భారత్‌ ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ వ్యవస్థ తీవ్రసంక్షోభంలో కూరుకుపోయుందన్నట్లు మాట్లాడటం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఎకనామిక్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్యూల్ మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితులలో కూడా భారత్‌ (ఆర్ధిక వ్యవస్థ) మునిగిపోకుండా నీటి ఉపరితలంపై తలను ఉంచగలుగుతోంది. భారత్ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిని చూసి నేను ఆందోళనగా ఉన్నానని చెప్పలేను కానీ సంతృప్తిగా మాత్రం లేనని చెప్పగలను,” అని అన్నారు. 

దేశంలో ఆటోమోబైల్ రంగంతో సహా పలురంగాలకు చెందిన పరిశ్రమలు నష్టాలలో మునిగిపోవడం, ఆ కారణంగా కార్మికులకు మారుతీ వంటి కొన్ని సంస్థలు లే ఆఫ్ ప్రకటించడం, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడం, ప్రజల పొదుపు ఖాతాలలో నిలువలు శరవేగంగా తగ్గిపోతుండటం, అదే సమయంలో దేశంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం వంటి అనేక అంశాలు దేశ ఆర్ధిక పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. 

అయితే ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాలలో శరవేగంగా దూసుకుపోతూ చాలా అభివృద్ధి సాధిస్తోందని బిజెపి నేతలు చెప్పుకొంటుంటే, దేశఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈవిధంగా ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. ఆమె దేశ ఆర్ధికమంత్రి కనుక దేశ ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లే భావించవలసి ఉంటుంది. ఈ పరిస్థితి నరేంద్రమోడీ ప్రభుత్వం ఏవిధంగా చక్కదిద్దుతుందో..చక్కదిద్దగలదో లేదో చూడాలి.


Related Post