బిజెపి కేసీఆర్‌ కనుసన్నలలో పనిచేస్తోందా!

August 02, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానం కోసం జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు కీచులాడుకోవడం చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు. ఇటీవల బిజెపి నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా స్పందించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయి ఒకే ఒక్కసీటు గెలుచుకున్న బిజెపి మా పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది. బిజెపి కార్యాలయానికే టులెట్ బోర్డు పెట్టుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలను చేర్చుకొని రాష్ట్రంలో బిజెపి బలపడిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. మా పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇంతవరకు బిజెపిలో ఎందుకు చేర్చుకోలేదో చెప్పగలరా? గత 5 ఏళ్ళలో బిజెపి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడలేకపోయిందంటే అది సిఎం కేసీఆర్‌ కనుసన్నలలో పనిచేస్తోంది గాబట్టే. ఇప్పటికీ తెరాస, బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందని ఆర్టీఐ బిల్లుకు తెరాస మద్దతు పలికినప్పుడే రుజువైంది. రాష్ట్రంలో తెరాసాను ఎదుర్కొని నిలువగల శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది,” అని అన్నారు. 

గతంలో తెరాస పట్ల రాష్ట్ర బిజెపి మెతకవైఖరి అవలంభించిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు తెరాస పట్ల బిజెపి అధిష్టానం వైఖరి మారడంతో రాష్ట్ర బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక సిఎం కేసీఆర్‌ కనుసన్నలలో బిజెపి పనిచేస్తోందనే పొన్నం ప్రభాకర్‌ వాదన అర్ధరహితంగా ఉందని చెప్పక తప్పదు. 

కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురాలేనప్పటికీ, బిజెపి వారి రాజకీయశత్రువు కనుక నిర్భయంగా పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడగలరు. కనుక నలుగురు బిజెపి ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేగలిగితే రాష్ట్ర ప్రజలను బిజెపి ఆక్కటుకోవచ్చు. కేవలం తెరాస, మజ్లీస్, కాంగ్రెస్‌ పార్టీలను విమర్శిస్తూ కాలక్షేపం చేస్తే రాష్ట్రంలో బిజెపి ఎప్పటికీ బలపడలేదని గ్రహిస్తే మంచిది. రాష్ట్ర కాంగ్రెస్ కూడా తెరాస, బీజేపీలను నిందిస్తూ కాలక్షేపం చేసే బదులు గ్రామస్థాయి నుంచి మళ్ళీ పార్టీని నిర్మించుకొంటే మంచిది.  


Related Post