స్నేహమా...రణమా? దేనికైనా రెడీ: మజ్లీస్

August 02, 2019


img

మజ్లీస్ పార్టీ హైదరాబాద్‌ పాతబస్తీకే పరిమితమైనప్పటికీ, దేశంలో తనకు బలముందని భావిస్తున్న నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగినప్పుడు పోటీ చేస్తుంటుంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పోటీ చేసిన మజ్లీస్ పార్టీ 2021 ఏప్రిల్ నెలలో జరుగబోయే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకొంది. ఆ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలలో ముస్లిం జనాభా ఎక్కువే ఉంది కనుక ఆ స్థానాలలో మాత్రం పోటీ చేయాలని భావిస్తోంది. అయితే అంతకంటే ముందుగా తమ పార్టీ పోటీ చేయడంపై బెంగాల్ సిఎం మమతా బెనర్జీ వైఖరి ఏమిటో తెలుసుకోవాలనుకొంది. 

మజ్లీస్ నేత అసీమ్ పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీని ఉద్దేశ్యించి ఒక ట్వీట్ చేశారు. “దీదీ.. మీరు మమ్మల్ని మిత్రులుగా భావిస్తారా లేక శత్రువులుగా భావిస్తారా? మిత్రులుగా భావిస్తే మీతో స్నేహానికి సిద్దంగా ఉన్నాము. శతృత్వానికైనా మేము సిద్దమే,” అని ట్వీట్ చేశారు. 

మజ్లీస్ ఈవిధంగా ట్వీట్ చేయడానికి బలమైన కారణమే ఉంది. ఇక్కడ రాష్ట్రంలో తెరాస-మజ్లీస్ మద్య స్నేహం కొనసాగుతోంది. అలాగే తెరాస-తృణమూల్ మద్య సత్సంబందాలున్నాయి కనుక తృణమూల్ కాంగ్రెస్‌ తమతో స్నేహం చేయడానికి అంగీకరిస్తే బాగుంటుందని మజ్లీస్ భావిస్తోంది. 

తృణమూల్, మజ్లీస్ పార్టీల ఉమ్మడి శత్రువు బిజెపియే కనుక తృణమూల్ కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలలో తమతో చేతులు కలిపితే బిజెపిని సులువుగా ఎదుర్కోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ తమకు సహకరిస్తే పశ్చిమబెంగాల్‌కు కూడా తమ పార్టీని విస్తరించుకోవచ్చని మజ్లీస్ ఆలోచనకావచ్చు. అందుకు బదులుగా మమతా బెనర్జీకి అండగా నిలబడి ఆమె అధికారం కాపాడుకోవడానికి మద్దతునీయాలని మజ్లీస్ ఆలోచన కావచ్చు. 

మజ్లీస్ పార్టీ ఎలాగూ బెంగాల్‌లో అడుగుపెట్టాలని నిశ్చయించుకొంది కనుక తాము వద్దన్నా రాకమానదు. బిజెపితో ఒంటరి పోరాటం చేస్తున్న మమతా బెనర్జీ, మజ్లీస్‌తో కూడా పోరాడటం కంటే దానితో చేతులు కలపడమే మంచిదని భావిస్తే మజ్లీస్ పార్టీకి బెంగాల్‌కు విస్తరించే అవకాశాలు పెరుగుతాయి. 


Related Post