రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు చింతమడక స్కీమ్?

August 01, 2019


img

సిఎం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకలో గల 2,000 కుటుంబాలకు ఇంటికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధికసాయం అందిస్తామని చేసిన ప్రకటనను సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్వాగతించారు. సుప్రీంకోర్టు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సాధారణంగా ఏదైనా ఒక నియోజకవర్గం లేదా ప్రాంతంలో ప్రజల కోరికపై ముఖ్యమంత్రులు  రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాల, ఆసుపత్రి లేదా సాగునీటి సౌకర్యం కల్పిస్తుంటారు. సిఎం కేసీఆర్‌ చింతమడక గ్రామంలో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధికసాయం అందిస్తామని ప్రకటించారు. దానితో వారు జీవనోపాధి ఏర్పరచుకొని జీవితంలో స్థిరపడగలరు. చింతమడక గ్రామ ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్న సిఎం కేసీఆర్‌ను మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. అయితే ఈ పధకాన్ని ఒక్క చింతమడక గ్రామానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఆరోగ్యశ్రీ వంటి పధకాలను కూడా ఇదే విధంగా ఎంపిక చేసిన కొన్ని జిల్లాలలో ప్రయోగాత్మకంగా నిర్వహించి అది విజయవంతం అవడంతో రాష్ట్రమంతటా దానిని విస్తరింపజేశారు. కనుక చింతమడకలో సిఎం కేసీఆర్‌ ప్రారంభించిన ఈ పధకాన్ని రాష్ట్రమంతటికీ వర్తింప జేసి రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధికసహాయం చేసినట్లయితే రాష్ట్రప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపినట్లవుతుంది...అదే బంగారి తెలంగాణ అవుతుంది. కావాలనుకుంటే దీనికి ‘చింతమడక పధకం’ అని పేరు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. తెలంగాణ ధనిక రాష్ట్రం గనుక రాష్ట్రమంతటికీ ఈ పధకాన్ని వర్తింపజేయవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కనుక రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఈ పధకాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post