ఫెడరల్ ఫ్రంట్‌ ఆవిర్భవించనుందా?

August 01, 2019


img

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సిఎం కేసీఆర్‌ తెరపైకి తెచ్చారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలలో దేనికీ పూర్తి మెజారిటీ రాదని కనుక ఫెడరల్ ఫ్రంట్‌ కేంద్రంలో కీలకపాత్ర పోషించడం తధ్యమని సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలందరూ బల్లగుద్ది వాదించారు. కానీ తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. 

ఆనాడు కాంగ్రెస్‌, బిజెపిలు ప్రభుత్వం ఏర్పాటుచేయలేవనే అంచనాలతో ఫెడరల్ ఫ్రంట్‌ ప్రతిపాదించగా, ఇప్పుడు బిజెపిని దాని వెనుక ఉన్న కేంద్రప్రభుత్వాన్ని ఎదుర్కొని తమను తాము కాపాడుకునేందుకు ప్రాంతీయపార్టీలన్నీ ఒక్క త్రాటిపైకి రాక తప్పనిసరి పరిస్థితులు కనబడుతున్నాయి. 

ఇప్పటికే కర్ణాటకలో బిజెపి ధాటికి కాంగ్రెస్‌-జెడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం బిజెపిని చూసి గడగడలాడుతోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపై బిజెపి కత్తి వేలాడుతోంది. తమ తదుపరి లక్ష్యం తెలంగాణలో అధికారంలోకి రావడమేనని రాష్ట్ర బిజెపి నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. ఏపీలో కూడా టిడిపిని కరిగించేస్తూ జగన్ కుర్చీ క్రింద మంట రగిలించే ప్రయత్నాలు బిజెపి నేతలు మొదలుపెట్టారు. తమిళనాడులో పేరుకు అన్నాడీఎంకె ప్రభుత్వం ఉన్నప్పటికీ దానిపై కేంద్రప్రభుత్వమే అధికారం చలాయిస్తోందనే టాక్ వినిపిస్తోంది. 

ఈవిధంగా అన్ని రాష్ట్రాలలో బిజెపి జోరు పెరిగిపోతుండటంతో దానిని కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు, అలనాడు పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి తమ అస్త్రశస్త్రాలను దించి యుద్దంచేసినట్లు, సిఎం కేసీఆర్‌ కూడా అటక మీద నుంచి ఫెడరల్ ఫ్రంట్‌ను కిందకు దించి బిజెపితో యుద్ధం చేయక తప్పేలా లేదు. ఆ ఫెడరల్ సైన్యంలో సిఎం కేసీఆర్‌ ఈసారి కాంగ్రెస్ పార్టీని కూడా చేర్చుకున్నా ఆశ్చర్యం లేదు.


Related Post