గోదారమ్మ ఒడి చేరనున్న ప్రాణహిత జలాధారాలు

August 01, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడంతో మహారాష్ట్ర నుంచి భారీగా తరలివస్తున్న నీటిని ఒడిసిపట్టి రాష్ట్రంలో అవసరమైన చోటికి తరలించుకుపోయే అవకాశం లభించింది. మేడిగడ్డ బ్యారేజి నుంచి అన్నారంకు అక్కడి నుంచి సుందిళ్ళ బ్యారేజీకి నీటిని ఎత్తిపోస్తూ నేడు ఎల్లంపల్లి బ్యారేజీకి తీసుకువస్తున్నారు. సుమారు 20 రోజులపాటు 120 కిమీ ఎదురెక్కి ప్రవహిస్తూ వచ్చిన గోదావరి జలాలు పెద్దపల్లి జిల్లాలోని అంటార్గాం మండలం గోలివాడ వద్ద నిర్మించిన సుందిళ్ళ పంప్‌హౌస్‌కు చేరుకున్నాయి. బుదవారం సాయంత్రం 7 గంటలకు సుందిళ్ళలో మొదటి పంపు ఆన్‌ చేసి నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. అక్కడి నుంచి రెండు కిమీ ప్రవహించి గురువారం ఉదయం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకొనున్నాయి. 

ఎల్లంపల్లిలో తగినంత నీటిమట్టం వచ్చిన తరువాత ఆగస్ట్ 5వ తేదీన మళ్ళీ నీటిని ఎత్తిపోయడం ఆరంభిస్తారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం నీరు చేరుకోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటిదశ నీటి తరలింపు ప్రక్రియ విజయవంతంగా ముగుస్తుంది. 

జూన్ 21వ తేదీన సిఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పటి నుంచి ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎత్తిపోతలు నిర్విరామంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం వేలాదిమంది రైతులు తమ భూములను త్యాగం చేయడంతో మొదలైన ఈ మహాద్భుత జలయజ్ఞo ప్రభుత్వం, మాజీ మంత్రి హరీష్‌రావు, అధికారులు, ప్రభుత్వ ఇంజనీర్లు, పదవీ విరమణ చేసిన ఇంజనీర్లు, కాంట్రాక్ట్ కంపెనీల ఇంజనీర్లు, అధికారులు, కార్మికుల రేయింబవళ్ల కృషితో సుసంపన్నం అవుతోంది. కనుక తెలంగాణ చరిత్రలో సాధించిన మరొక సమిష్టి విజయంగా దీనిని చెప్పుకోవచ్చు. దీంతో తెలంగాణ రాష్ట్ర సాధనలో మొట్టమొదటి లక్ష్యమైన ‘నీళ్ళు’ సాధించినట్లయింది.


Related Post