నేనూ అలాంటి భాదితుడినే: విజయ్ మాల్యా

July 31, 2019


img

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు విజి సిద్దార్థ ఆత్మహత్య దేశంలో ఒక సరికొత్త చర్చకు బీజం వేసింది. వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు దేశంలో చోటులేదా? అటువంటివారు భారతదేశంలో రాణించలేరా? వారు ఐ‌టి, ఈడి, వివిద ప్రభుత్వ శాఖల వేధింపులు భరించక తప్పదా?అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. అధికారుల వేధింపులు, ఒత్తిళ్ళ కారణంగానే సిద్దార్ధ అన్యాయంగా బలైపోయారని దేశంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఉన్నవారు అభిప్రాయపడుతున్నారు. 

వారేకాదు...బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా కూడా అదే అంటున్నాడు. తాను కూడా విజి సిద్దార్థలాగే బాధితుడినని ట్వీట్ చేశారు. “సిద్దార్ధ ఒక అద్భుతమైన, మంచి తెలివైన పారిశ్రామికవేత్త. చనిపోయేముందు ఆయన లేఖలో వ్రాసిన విషయాలు చూసి నాకు చాలా బాధ కలిగింది. బ్యాంకులు, విచారణ సంస్థలు ఎటువంటి వ్యక్తినైనా నిరాశ నిస్పృహలలో కూరుకుపోయేలా చేయగలవు. బ్యాంకుల నుంచి నేను తీసుకున్న అప్పులు పూర్తిగా చెల్లిస్తానని చెపుతున్నప్పటికీ అవి నాపట్ల ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు,” అని ట్వీట్ చేశారు.

అయితే సిద్దార్ధ ఆత్మహత్యను విజయ్ మాల్యా చాలా తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకొని ట్వీట్ చేసినప్పటికీ, వారిరువురి వైఖరులు, వ్యాపార నిర్వహణ తీరు అన్ని భిన్నంగా ఉండేవని అందరికీ తెలుసు. 

బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులతో విజయ్ మాల్యా తనకు ఎంతో పేరుప్రతిష్టలు తెచ్చిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను కాపాడుకునే ప్రయత్నం చేయకపోగా చాలా విలాసవంతంగా జీవించేవాడు. బ్యాంకుల అప్పులు తీర్చే ఉద్దేశ్యం లేదన్నట్లు మాట్లాడేవాడు. చివరికి రహస్యంగా లండన్ పారిపోయాడు. 

కానీ ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సిద్దార్ధ ఎంతో కష్టపడి తన తెలివి తేటలతో అంచెలంచెలుగా పైకి ఎదిగారు. అప్పులు తీర్చేందుకు తన షేర్లు అమ్ముకునేందుకు సిద్దపడ్డారు తప్ప విజయ్ మాల్యాలాగ దేశం విడిచి పారిపోవాలనుకోలేదు. కానీ ఐ‌టి శాఖ నిర్వాకంతో ఆయన వాటిని తీర్చలేని నిస్సహాయుడయ్యారు. చివరికి ఒత్తిళ్ళు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు.

వ్యాపారవేత్తలు తమ అప్పులను పూర్తిగా తీర్చేవిధంగా వ్యవస్థలు పనిచేయాలి తప్ప విజయ్ మాల్యాలాగా వారు దొంగచాటుగా విదేశాలకు పారిపోవలసిన పరిస్థితులు కల్పించడమో లేదా సిద్దార్ధలాగ ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు కల్పించకూడదని సిద్దార్థ ఆత్మహత్యతో రుజువైంది.


Related Post