అవసరం ఉన్నప్పుడు మొహం చాటేసి...

July 31, 2019


img

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి గత 5 ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మద్య అనేకానేక అపరిష్కృత సమస్యలు… వాటిపై అనేక వివాదాలు కొనసాగాయి. కారణాలు అందరికీ తెలిసినవే. ఆ సమయంలో జోక్యం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించాలని రెండు రాష్ట్రాలు పదేపదే విజ్ఞప్తి చేసాయి కానీ కేంద్రప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆ సమస్యలు అలాగే అపరిష్కృతంగా ఉండిపోయాయి. 

తెరాస అధిష్టానంతో మంచి సఖ్యత ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మద్య మంచి సక్యత ఏర్పడింది. ముఖ్యంగా నదీ జలాల పంపకాలపై కోర్టులను, ట్రిబ్యూనల్స్ ను ఆశ్రయించకుండా, వాటి ప్రమేయం లేకుండా పరస్పరం చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుందామని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. అలాగే మిగిలిన సమస్యలను కూడా సామరస్యంగా పరిష్కరించుకుందామని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాధినేతల మద్య సఖ్యత ఏర్పడింది కనుక రెండు రాష్ట్రాల ప్రభుత్వ అధికారుల మద్య కూడా సానుకూలవాతావరణం ఏర్పడింది. దాంతో అధికారుల స్థాయిలో కూడా సమస్యలపై చర్చలు మొదలయ్యాయి. కనుక ఇప్పుడు కేంద్రప్రభుత్వం జోక్యం లేదా ప్రమేయం అవసరం లేదని అర్ధమవుతోంది. 

కానీ సాయం కోరినప్పుడు ముందుకురాని కేంద్రహోంశాఖ ఇప్పుడు విభజన సమస్యల చర్చించడానికి ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులను ఆగస్ట్ 8వ తేదీన డిల్లీకి రావలసిందిగా కబురు పంపింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర సచివాలయం నార్త్ బ్లాకులో సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో షెడ్యూల్ 9 మరియు 10లకు సంబందించిన సమస్యలపై చర్చించబోతున్నట్లు తెలియజేసింది. కేంద్రప్రభుత్వం ఇదేపని 3-4 ఏళ్ళు క్రితమే చేసి ఉండి ఉంటే నేడు ఇన్ని సమస్యలు పేరుకుపోయుండేవే కావు కదా?


Related Post