అప్పుడు చంద్రబాబు...ఇప్పుడు జగన్!

July 31, 2019


img

ఇదివరకు ఏపీ మాజీ సిఎం చంద్రబాబునాయుడు బిజెపితో, కేంద్రప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్దపడినప్పుడు ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో సహా రాష్ట్ర బిజెపి నేతలు ఆయన జగన్‌మోహన్‌రెడ్డి ఉచ్చులో చిక్కుకొంటున్నారని, కనుక ఆ ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తపడమని పదేపదే హెచ్చరించారు. కారణాలు ఏవైతేనేమీ చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయారు. విచిత్రమైన విషయమేమిటంటే, జగన్ ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరించిన బిజెపి, తమతో టిడిపి తెగతెంపులు చేసుకోగానే అదే జగన్‌తో స్నేహం చేసింది. ఇపుడు అదే జగన్‌ను విమర్శిస్తోంది.  అదివేరే విషయం.

ఆనాడు బాబును బిజెపి నేతలు హెచ్చరించినట్లే ఇప్పుడు టిడిపి నేతలు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని హెచ్చరిస్తుండటం విశేషం. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళు తరలింపు విషయంలో సిఎం జగన్‌, తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఉచ్చులో చిక్కుకొంటున్నారని టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ హెచ్చరించారు. సిఎం కేసీఆర్‌ ప్రతిపాదనలను జగన్‌ అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని, కనుక ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్డిగా ముందుకు వెళితే తాము అడ్డుకొంటామని మాణిక్యప్రసాద్ హెచ్చరించారు.


Related Post