మాటలెందుకు...సత్తా చూపొచ్చు కదా?

July 31, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో బిజెపి భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలలో బిజెపి నేతల వాయిస్ చాలా పెరిగింది. అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని పాట పాడుతున్నారు. తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో రాష్ట్ర బిజెపి నేతలు మరికాస్త జోరుగా ఉన్నారు. బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మంగళవారం ఖమ్మంలో జరిగిన పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మళ్ళీ అదే పాట పాడారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెరాసకు మేమే ప్రత్యామ్నాయమని రాష్ట్రంలో ఇతరపార్టీల నేతలు కూడా గుర్తించారు కనుకనే వివిదపార్టీల నేతలు మాపార్టీలో చేరేందుకు తరలివస్తున్నారు. ప్రజలు కూడా ఈవిషయాన్ని గుర్తించారు కనుకనే బిజెపి సభ్యత్వం తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. రానున్న రోజులలో ఇంకా అనేకమంది నేతలు మా పార్టీలో చేరానున్నారు. మా పార్టీని బలోపేతం చేసుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాము. వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతను మేము వ్యతిరేకిస్తున్నాము. కేసీఆర్‌ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారు. మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే ముందస్తుకు వెళుతున్నారు. కానీ ఆ ఎన్నికలలో కూడా మా పార్టీ సత్తా చాటుతుంది,” అని అన్నారు. 

తెరాసకు తామే ప్రత్యామ్నాయమని బిజెపి నేతలు పదేపదే చెప్పుకునే బదులు మున్సిపల్ ఎన్నికలలో గెలిచి నిరూపించుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు గొప్పలు చెప్పుకొని మున్సిపల్ ఎన్నికలలో తెరాస చేతిలోనే ఓడిపోతే వారికి, వారి పార్టీకి కూడా అవమానమే కదా?అయితే కర్ణాటక రాష్ట్రంలోలాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను లొంగదీసుకొని అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నించకుండా పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు చెప్పుకోవడం తెరాసకు చాలా ఊరటనిచ్చేదే.


Related Post