యాదాద్రిలో సిఎం కేసీఆర్‌ సుదర్శనయాగం

July 31, 2019


img

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణపనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తికావస్తుండటంతో, సిఎం కేసీఆర్‌ యాదాద్రిలో సుదర్శనయాగం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆయన మంగళవారం శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని చిన్న జియ్యర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళి యాగం ఏర్పాట్ల గురించి చర్చించారు. సుమారు 100 ఎకరాలలో...1048 యజ్ఞ కుండాలతో...3,000 మంది రుత్విక్కులు..మరో 300 మంది వేదపండితులతో సుదర్శనయాగం నిర్వహించాలనుకొంటున్నట్లు సిఎం కేసీఆర్‌ తెలిపారు. భారతదేశంలోని తిరుపతి, శ్రీరంగం, బద్రీనాధ్, పూరీ జగన్నాధ్ తదితర వైష్ణవ పుణ్యక్షేత్రాల నుంచి వేదపండితులను, వైష్ణవ పీఠాధిపతులను ఈ సుదర్శనయాగానికి ఆహ్వానించాలనుకొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులను, గవర్నర్లను ఈ యాగానికి ఆహ్వానించాలనుకొంటున్నట్లు తెలిపారు. విదేశాలలో ఉన్న వైష్ణవ ఆలయాల నుంచి వేదపండితులను ఆహ్వానించబోతున్నట్లు తెలిపారు. చిన్న జియ్యర్ స్వామి అధ్వర్యంలో సుదర్శనయాగం నిర్వహించబోతున్నారు కనుక త్వరలో ఆయనే ఎప్పుడు ఎన్ని రోజులపాటు ఈ యాగాన్ని నిర్వహించబోతున్నారో ప్రకటించవచ్చు. 

ప్రభుత్వాధినేతలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం కొత్తకాదు కానీ ఈ స్థాయిలో యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయడం చాలా అరుదే. అవి రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సు కోరి చేస్తున్నవే అయినా వాటికోసం కోట్లాదిరూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం విమర్శలకు తావిచ్చేదిగా ఉంది. భక్తి, దేవతార్చన, ఆరాధన ముఖ్యమనుకుంటే దానికి ఆర్బాటం, ప్రచారం అవసరమే లేదు. చాలా నిరాడంబరంగా కూడా చేసుకోవచ్చు. కానీ ఈ యాగానికి చేయబోతున్న ఏర్పాట్లు, ఆహ్వానించబోయే అతిధుల జాబితా చూస్తుంటే దేవతార్చన చేయాలనే తపన కంటే ఆడంబర ప్రదర్శనమే ఎక్కువగా కనిపిస్తోంది. కనుక ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు గుప్పించకమానవు.


Related Post