ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం

July 30, 2019


img

నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు నేడు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. దీనికి అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 మంది ఓట్లేయడం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిందని ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఊహించినట్లుగానే కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, ఆర్జేడి సభ్యులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీనిపై జరిగిన చర్చలో అన్ని పార్టీల సభ్యులు పాల్గొన్నప్పటికీ తెరాస, టిడిపి, వైసీపీ, అన్నాడిఎంకె, డిఎంకె, జెడియు, ఎన్సీపీ సభ్యులు ఓటింగులో పాల్గొనలేదు. బీఎస్పీ సభ నుంచి వాకవుట్ చేసింది. దాంతో సభలో హాజరైన సభ్యుల సంఖ్య దానితోపాటే బిల్లు ఆమోదం కోసం కావలసిన మ్యాజిక్ ఫిగర్ కూడా తగ్గింది. కనుక ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందగలిగింది. దీనికి పార్లమెంటు ఆమోదముద్ర పడింది కనుక తరువాత రాష్ట్రపతి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అది లాంఛనప్రాయమే కనుక త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చడం తధ్యం. 

ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుపై నిర్ద్వందంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసి ఓటింగులో పాల్గొని ఉండి ఉంటే చాలా హుందాగా ఉండేది కానీ అవి తమ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం ‘కర్ర విరగకూడదు...పాము చావకూడదన్నట్లు’ కపటంగా వ్యవహరించాయి. ఎందుకంటే, ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే ముస్లిం ప్రజల ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. వ్యతిరేకంగా ఓటు వేస్తే మోడీ ప్రభుత్వంతో కోరుండి శతృత్వం కొని తెచ్చుకొన్నట్లవుతుంది. అందుకే తటస్థంగా వ్యవహరించడంతో రాజ్యసభలో మోడీ సర్కారుకు తగినంత బలం లేనప్పటికీ సునాయాసంగా బిల్లును ఆమోదింపజేసుకోగలిగింది. కనుక దీనిపై తటస్థంగా వ్యవహరించిన ప్రాంతీయ పార్టీలన్నీ పరోక్షంగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినట్లే భావించవచ్చు. 

ఈ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివలన వివాహిత ముస్లిం మహిళలకు, వారి పిల్లల జీవితాలకు కూడా భద్రత కలుగుతుందని బిజెపి వాదిస్తోంది. కానీ దీనితో ముస్లిం కుటుంబాలు ఇంకా తీవ్ర సమస్యలలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని బిల్లును వ్యతిరేకిస్తున్నవారి వాదన. ఏది ఏమైనప్పటికీ ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చబోతోంది.


Related Post