జగ్గారెడ్డి హడావుడి అందుకేనా?

July 30, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం కాస్త గట్టిగా మాట్లాడుతున్న వారిలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రధానంగా కనిపిస్తున్నారు. సంగారెడ్డికి త్రాగునీరు ఇవ్వాలని హడావుడి చేస్తున్న ఆయన పట్టణంలోని తారాడిగ్రీ కళాశాలలోని పీజీ కళాశాల తరలింపును వ్యతిరేకిస్తూ పోరాడి అడ్డుకోగలిగారు. ఇప్పుడు దానికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంగారెడ్డి ప్రజల గొంతు ఎండినప్పుడు ఎంతగా పోరాడినా వారికి నీరు అందించలేకపోయారు కానీ ఆయన తన ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. పఠాన్‌చెరుకు వస్తున్న గోదావరి జలాలలో సంగారెడ్డికి వాటా ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. లేకుంటే ఈ సమస్యపై భారీ బహిరంగసభ నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగడతానని హెచ్చరిస్తున్నారు. 

ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మరో రెండేళ్ళ వరకు తెరాస సర్కారును విమర్శించబోనని ప్రకటించిన జగ్గారెడ్డి, ఆ సంగతి మరిచిపోయినట్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అవకాశం చిక్కినప్పుడల్లా మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్‌రావుపై విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. 

జగ్గారెడ్డి అప్పుడప్పుడు స్థానిక ప్రభుత్వాసుపత్రులలో తనిఖీలు చేస్తూ రోగులను పరామర్శిస్తూ, పనిలోపనిగా ఆసుపత్రిలో అరకొర సౌకర్యాలపై, రోగులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆసుపత్రి అధికారులను నిలదీస్తున్నారు. ఈ హడావుడి అంతా త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల కోసమేనని తెరాస నేతౌ వాదిస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను గెలుచుకొని తన సత్తా చాటుకోవడం కోసమే జగ్గారెడ్డి ఇంత హడావుడి చేస్తున్నారని లేకుంటే గడపదాటి బయటకు వచ్చేవారే కారని తెరాస నేతలు అంటున్నారు. ఆ రెండు మున్సిపాలిటీలలో తన అనుచరులను గెలిపించుకోగలితే సిఎం కేసీఆర్‌ స్వయంగా తనను తెరాసలోకి ఆహ్వానించి చేర్చుకొంటారని ఆయన ఆశ పడుతున్నారేమో తెలియదు కానీ జగ్గారెడ్డి హడావుడి ఎన్నికల కోసమేననిపిస్తుంది.


Related Post