కర్ణాటకలో 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

July 29, 2019


img

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 14 మంది కాంగ్రెస్‌, 3 జెడిఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అంతకు ముందు మరో ముగ్గురిపై కూడా ఇదే కారణంతో వేటు వేయడంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరింది. వారందరూ 2023 ఎన్నికల వరకు ఏ ఎన్నికలలోనూ పోటీ చేయడానికి అనర్హులని ఆయన ప్రకటించారు. 

ఆ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం వలననే కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది కనుక స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలు స్వాగతించడం సహజం. కానీ వారి తిరుగుబాటు వ్యవహారంతో తమకేమీ సంబందం లేదని ఇంతవరకు బుకాయిస్తున్న బిజెపి స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా వారిని ప్రోత్సహించింది తామేనని స్వయంగా చాటి చెప్పుకొన్నట్లయింది. లేకుంటే కాంగ్రెస్‌, జెడిఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేస్తే బిజెపి ఆందోళన చెందవలసిన అవసరం ఏమిటి?

అయితే స్పీకర్ నిర్ణయం వలన బిజెపికే మేలు కలిగించిందని చెప్పవచ్చు. అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో శాసనసభ్యుల సంఖ్య 207కి పడిపోయింది. కనుక మ్యాజిక్ ఫిగర్ 104 అయ్యింది. బిజెపికి 105 మంది, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 106 మంది ఎమ్మెల్యేలున్నారు. కనుక ఈ రోజు శాసనసభలో జరుగబోయే బలపరీక్షలో యడియూరప్ప గట్టెక్కేయవచ్చు. కానీ బిజెపి ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారంటూ మాజీ సిఎం సిద్దరామయ్య బాంబు పేల్చారు. 

106 మంది ఎమ్మెల్యేలకీ మంత్రిపదవులు ఇవ్వడం సాధ్యం కాదు కనుక వారిలో నలుగురు ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే చాలు యడ్డియూరప్ప ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. పైగా ఇప్పటివరకు కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలు ప్రాతినిధ్యం వహించిన 17 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉపఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధిస్తే శాసనసభలో కాంగ్రెస్‌-జెడిఎస్‌, బిజెపిల బలాబలాలు మారిపోతాయి. అప్పుడు మళ్ళీ ప్రభుత్వం కూలిపోయేపరిస్థితి రావచ్చు. 

కనుక అవకాశవాదానికి పరాకాష్టగా నిలిచిన కర్ణాటక రాజకీయాలలో ఏ నిమిషానికి ఏమి జరుగునో...అన్నట్లు సాగుతున్నాయి. ఈ రాజకీయ బురదలో కమలం వికసించింది. దానితోపాటే మరో ఆణిముత్యం కూడా బయటపడింది. అదే స్పీకర్ రమేశ్ కుమార్. గవర్నర్‌, కేంద్రప్రభుత్వం, బిజెపి, కాంగ్రెస్‌-జెడిఎస్‌ల ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగకుండా నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ బలపరీక్షలను నిర్వహిస్తూ, తప్పు చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై కేవలం 2 వారాలలో అనర్హత వేటు వేయడం ద్వారా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు స్పీకర్ రమేశ్ కుమార్.


Related Post