అవే తెరాసకు శ్రీరామరక్ష?

July 27, 2019


img

ఏ పార్టీకైనా విశ్వసనీయత చాలా ముఖ్యం అప్పుడే ప్రజలు దానిని నమ్మి ఓటేస్తారు. ఆ విశ్వసనీయతను తెరాస ఏర్పరచుకోగలిగింది కనుకనే వరుసగా రెండుసార్లు ప్రజలు దానికి అధికారం కట్టబెట్టారు. పదేళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ విశ్వసనీయత కోల్పోవడంతో ప్రజలు దానిని పక్కన పెడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ-సిఎం కేసీఆర్‌ స్నేహం కారణంగా రాష్ట్రంలో బిజెపి విశ్వసనీయత దెబ్బతింది. అందుకే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని తిరస్కరించారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ పట్ల తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత నమ్మకం ఉండబట్టే రాష్ట్రంలో బిజెపికి నాలుగు సీట్లు లభించాయని చెప్పవచ్చు. మోడీని చూసే తెలంగాణ ప్రజలు బిజెపికి ఓటేశారని ఆ పార్టీ నేతలే స్వయంగా చెప్పుకొంటున్నారు. కనుక ఎన్నికలలో ఎన్ని వ్యూహాలు అమలుచేసినపటికీ, ఓటర్లను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినప్పటికీ అభ్యర్ది...అతని పార్టీ యొక్క విశ్వసనీయత కూడా జయాపజయాలను నిర్ణయిస్తుందని స్పష్టం అవుతోంది. 

ఇంతకీ ఇప్పుడు విశ్వసనీయత సోది అంతా దేనికంటే... రాష్ట్రంలో రెండవ స్థానం కోసం కీచులాడుకొంటున్న కాంగ్రెస్‌, బిజెపిలు “తెరాసతో మీరు కుమ్మక్కు అయ్యారని ఆరోపిస్తుంటే కాదు...మీరే కుమ్మక్కయ్యారని “ ప్రత్యారోపణలు చేసుకొంటున్నాయి. తద్వారా వాటి విశ్వసనీయతను అవే ప్రశ్నార్ధకంగా మార్చుకొంటూ ప్రజలకు తమ పార్టీలపై మరింత అపనమ్మకం ఏర్పరుచుకొంటున్నాయి. 

పరస్పరం దెబ్బ తీసుకునే ప్రయత్నాలలో తామే నష్టపోతున్నామని కాంగ్రెస్‌, బిజెపిలు గ్రహించాయో లేదో తెలియదు. మున్సిపల్ ఎన్నికలకు ముందు అవి మొదలుపెట్టిన ఈ ‘కుమ్మక్కు పోరాటాలు’ ఎంత జోరుగా సాగితే అంతా వాటికే నష్టం అని గ్రహించినట్లు లేవు. కనుక వాటి విశ్వసనీయతను అవే దెబ్బ తీసుకొంటుంటే ఎవరికి లాభం అంటే తెరాసకె నాని వేరే చెప్పనక్కరలేదు. ఇది మున్సిపల్ ఎన్నికలలో మరోమారు రుజువవుతుందేమో?


Related Post