యడియూరప్ప చాణక్యం...ఊహాతీతమే

July 27, 2019


img

ఇల్లలకాగానే పండుగ కాదన్నట్లు కర్ణాటక సిఎం కుర్చీలో కూర్చోనంత మాత్రన్న యడియూరప్ప పండగ చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి 103 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిపి యడియూరప్పకు 106 మంది సభ్యులున్నారు.ఇది శాసనసభలో కుమారస్వామి బలపరీక్ష చేసుకొన్నప్పుడు 15 మంది రెబెల్ ఎమ్మేల్యేలు గైర్ హాజరైనప్పటి మాట. 

కానీ ఆ 15మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఇంతవరకు ఆమోదించలేదు. వారిపై అనర్హత వేటువేయలేదు. కనుక వారితో కలిపి శాసనసభ్యుల సంఖ్య 224. ఇటీవల వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినందున ఎమ్మెల్యేల సంఖ్య 221 అయ్యింది. ఆ లెక్కన ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 112 అవుతుంది. కానీ యడియూరప్ప వద్ద 106 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సోమవారం శాసనసభలో బలపరీక్ష జరుగుతుంది. కనుక ఆలోగా మ్యాజిక్ ఫిగరును మళ్ళీ 106 కంటే తక్కువ ఉండేలా ‘సెట్’ చేయడానికి మళ్ళీ చక్రం తిప్పాలి లేదా తిరుగుబాటు ఎమ్మెల్యేలను కూడగట్టుకోవాలి. 

స్పీకర్ రమేశ్ కుమార్ వద్ద రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలున్నాయి. ఆయన వాటిని ఆమోదించినా లేదా వారందరిపై అనర్హత వేటువేసినా యడియూరప్ప శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కనుక స్పీకరు ఆ పని చేయకుండా అడ్డుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన బిజెపి మాట వినాల్సిన అవసరం లేదు...వింటారనే నమ్మకం లేదు. కాంగ్రెస్‌కు కొమ్ముకాసే స్పీకర్‌ను ఇంకా కొనసాగిస్తే మొదటికే మోసం రావచ్చు. కనుక ఈ సమస్యను అధిగమించడానికి యడియూరప్ప మళ్ళీ తన తెలివితేటలు మరోసారి ప్రదర్శించబోతున్నారు. స్పీకర్ రమేశ్ కుమార్ ఏ నిర్ణయం తీసుకోకమునుపే ఆయనను ఆ పదవిలో నుంచి దించేయడానికి సిద్దం అవుతున్నారు. 

కానీ ఈవిషయం కాంగ్రెస్ పార్టీకి, స్పీకర్‌కు తెలియదనుకోలేము. కనుక వారు కూడా చురుకుగా పావులు కడిపి రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. 

ఈ సమస్యను కూడా అధిగమించడానికి యడియూరప్ప మరో వ్యూహం సిద్దం చేశారు. తాను ఎవరిని గద్దె దించాడో వారి మద్దతే కోరినట్లు సమాచారం. విచిత్రంగా జెడిఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు ఇవ్వడానికి సిద్దపడుతున్నట్లు వారి అధినేత దేవగౌడ స్వయంగా చెప్పడం విశేషం. ఈ నేపద్యంలో కర్ణాటక రాజకీయాలలో ఏ క్షణం ఏమి జరుగుతుందో అన్నట్లు చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.


Related Post