రాష్ట్రంలో తెరాస, బిజెపిలు పోటాపోటీగా సభ్యత్వ నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్‌లో నియోజకవర్గం ఇన్-ఛార్జ్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెరాస 60 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 40 లక్షల మందిని చేర్చుకున్నట్లు తెలిపారు. వారిలో 20 లక్షల మంది వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసినట్లు తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ నేతలకు మున్సిపల్ ఎన్నికలకు సంబందించి దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ 3, బిజెపి 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడం వాటి జోరు పెరిగిందని, తెరాసకు తామే ప్రత్యామ్నాయమని వాదించడం మొదలుపెట్టాయని, ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిలు కొన్ని స్థానాలు గెలుచుకున్నా వాటి జోరు మరింత పెరుగుతుందని కనుక వాటికి ఆ అవకాశం ఇవ్వరాదని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో తెరాస విజయం సాధించి గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. కనుక నేతలందరూ అప్రమత్తంగా, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించడానికి గట్టిగా కృషి చేయాలని కేటీఆర్ కోరారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన జిల్లాలలో వెంటనే బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిలు రెండూ తమ సత్తా చాటుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తాయి కనుక వాటిని తక్కువగా అంచనా వేయవద్దని పార్టీ నేతలను, కార్యకర్తలను కేటీఆర్ కోరారు. ముఖ్యంగా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న బిజెపి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.