కేంద్రహోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగస్ట్ 15-17 తేదీల మద్య తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. రాష్ట్రంలో బిజెపి సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత జోరుగా సాగించేందుకు ఆయన స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని అమిత్ షా గత పర్యటనలోనే ప్రకటించారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈసారి ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే బిజెపి సభ్యత్వం తీసుకోబోతునట్లు సమాచారం. రాష్ట్రంలో రంగారెడ్డి లేదా మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయన సభ్యత్వం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఆయన తెలంగాణపై ఎంతగా దృష్టి సారిస్తున్నారో గ్రహించవచ్చు.
ఈసారి అమిత్ షా పర్యటనలో రాష్ట్రంలోని తెరాసతో సహా కాంగ్రెస్, టిడిపిలకు చెందిన కనీసం 25 మంది రాజకీయ నాయకులను బిజెపి చేర్చడానికి పార్టీ కార్యదర్శి రాంమాధవ్, పార్టీ అధికార ప్రతినిధి మురళీధర్ రావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితర నేతలు తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలతోనే రాష్ట్రంలో బిజెపి విజయయాత్ర ప్రారంభం కావాలని అమిత్ షా రాష్ట్ర నేతలకు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైతే దానిని బట్టి అవసరమైతే అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్లో మార్పు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర బిజెపిని అమిత్ షా స్వయంగా ముందుండి నడిపించే ఆలోచనలో ఉన్నట్లు భావించవచ్చు. బిజెపి చేస్తున్న ఈ ప్రయత్నాలను గమనించినట్లయితే ఇక నుంచి రాష్ట్రంలో మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.