అక్బరుద్దీన్ అందుకే కరీంనగర్‌ వచ్చారా?

July 26, 2019


img

మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కరీంనగర్‌లో ప్రసంగంపై బిజెపి ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ ఘాటుగా స్పందించడంతో అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తిరిగి స్పందించారు. “నా ప్రసంగం చట్టానికి, రాజ్యాంగానికి లోబడే ఉంది. ఎవరినీ కించపరచలేదు. కానీ మీడియాలో ఒకవర్గం, కొందరు నేతలు ఉద్దేశ్యపూర్వకంగా నా మాటలను వక్రీకరించారు. నేను ఏ వర్గం ప్రజలను నొప్పించాలనుకోవడం లేదు,” అని అన్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో కరీంనగర్‌లో ఎదురుదెబ్బ తిన్న తెరాస, త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో బిజెపిని నేరుగా ఎదుర్కోలేకనే మజ్లీస్ పార్టీని రంగంలో దింపిందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజల మద్య చిచ్చుపెట్టే విధంగా ప్రసంగించినా తెరాస స్పందించలేదని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలు సహేతుకంగానే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.  

ఎందుకంటే, లోక్‌సభ ఎన్నికల వరకు బిజెపిని తెరాస పెద్దగా పట్టించుకునేది కాదు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి150 సీట్లు కంటే ఎక్కువ గెలుచుకోలేదని, రాష్ట్రంలో ఒక్కసీటు కూడా గెలుచుకోలేదని సిఎం కేసీఆర్‌ గట్టిగా నొక్కి చెప్పారు, లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో తాను చక్రం తిప్పడం ఖాయం అని బల్లగుద్ది మరీ వాదించారు. కానీ కేంద్రంలో బిజెపి 303 సీట్లు, రాష్ట్రంలో నాలుగు సీట్లు గెలుచుకొంది. వాటిలో ఒకటి ఆయన కుమార్తె కవిత పోటీ చేసిన నిజామాబాద్‌ సీటు కూడా ఒకటి కావడంతో తెరాసకు పెద్ద షాక్ అనే చెప్పాలి. 

బిజెపికి నాలుగు, కాంగ్రెస్ పార్టీకి 3 ఎంపీ సీట్లు కోల్పోవడానికి తెరాస ఏవో కారణాలు చెప్పుకొని సమర్ధించుకున్నప్పటికీ, తమ ఓటమిని తెరాస చాలా సీరియస్‌గా తీసుకొందని అక్బరుద్దీన్ ఓవైసీ ఎంట్రీతో స్పష్టం అయ్యింది. 

సంస్మరణ సభకు వచ్చిన అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడినట్లు ప్రజలను రెచ్చగొట్టేవిదంగా మాట్లాడటం గమనిస్తే ఆయన మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడారని స్పష్టం అవుతోంది. ఆయన మాటలను తెరాస ఖండించకపోవడం వలన తెరాస ప్రోద్బలంతోనే ఆయన కరీంనగర్‌ వచ్చి ఉంటారని బిజెపి నేతలు అనుమానించడంలో తప్పు లేదు. 

అయితే బిజెపి ఊహిస్తునట్లుగా ఒకవేళ కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలలో మజ్లీస్ పార్టీ తెరాసకు మద్దతుగా రంగంలో దిగితే వాటిని ఎదుర్కొని విజయం సాధించగలదా లేదో ముందే అంచనా వేసుకుంటే మంచిది. 


Related Post