తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో వేలాది చెరువులలో పూడిక తీసి మంచినీటితో నింపడమే కాక వాటిల్లో ఏటా కోట్లాది చేపపిల్లలను విడిచిపెడుతూ స్థానిక మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సిద్దం అవడంతో ఆ ప్రాజెక్టు పొడవునా ఎక్కడ చూసినా డ్యాములు, కాలువలు, నీళ్ళతో కళకళలాడుతున్నాయి. వాటిలో కూడా చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలను కూడా పెంచినట్లయితే వేలాదిమంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోనే 1.5 కోటి రొయ్య, చేప పిల్లలను విడిచిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లేదా అనుబందంగా ఉన్న అన్ని డ్యాములు, బ్యారేజీలు, కాలువలు, చెరువులలో 50.59 కోట్ల చేప, రొయ్య పిల్లలను, కాళేశ్వరంతో కలుపుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని చెరువులు, రిజర్వాయర్లలో కలిపి మొత్తం 80.86 కోట్లు రొయ్య, చేప పిల్లలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి రొయ్యలు, కొర్రమీనులు, రవ్వ, జెల్ల, వాలుగ, కట్ల, తిలాపియా మొదలైన రకాల చేప పిల్లలను పంపిణీ చేసి తద్వారా రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల ఆదాయం గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. చేపపిల్లల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. రాష్ట్రంలో వర్షాలు జోరందుకోగానే చేపపిల్లల పంపిణీ మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇంత భారీ స్థాయిలో చేపల ఉత్పత్తి మొదలైతే వాటిని ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే అనుబంద పరిశ్రమలు కూడా రాష్ట్రానికి తరలివస్తాయి. అదే కనుక జరిగితే, సముద్రతీరం కలిగి ఉన్నందున మత్స్యసంపదకు, మత్స్య పరిశ్రమలకు కేంద్రాలుగా ఉన్న ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలతో పాటు పోటీపడే స్థాయికి తెలంగాణ రాష్ట్రం కూడా ఎదుగుతుంది.