నిరుద్యోగభృతి ఎప్పుడు చెల్లిస్తారు? కోదండరాం

July 26, 2019


img

సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం ప్రజాస్వామిక తెలంగాణవేదిక అధ్వర్యంలో ప్రతిపక్షాలు చేపట్టిన ‘ఛలో సచివాలయం’ కార్యక్రమంలో పాల్గొన్న టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, “మన దగ్గర అవసరానికి మించి డబ్బు ఉందంటే ఎన్ని కొత్త భవనాలు కట్టుకున్నా పరువలేదు. అందరూ సంతోషిస్తాము. మనకు సచివాలయమే లేకపోతే అందరం తలో రూపాయి వేసుకొని కట్టుకోవచ్చు. కానీ ఒకపక్క రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, ఉన్న భవనాలను కూల్చుకొని వందల కోట్ల ప్రజాధనం వృధా చేసి మళ్ళీ కొత్త భవనాలు కట్టుకోవాలనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం సకాలంలో విద్యార్ధుల ఫీజ్ రీఇంబర్స్మెంట్ చెల్లించలేకపోతోంది. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు చెల్లించడం లేదు. పంటరుణాల మాఫీ చేయలేదు. నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పింది కానీ ఇంతవరకు ఇవ్వనేలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తానని చెప్పింది కానీ కట్టలేకపోతోంది. ఇటువంటి ముఖ్యమైన సంక్షేమ పధకాలకు చెల్లింపులు చేయకుండా ఉన్న భవనాలను కూల్చుకొని మళ్ళీ కొత్త భవనాలు కట్టుకోవాలనుకోవడం దేనికో అర్ధం కాదు. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చేవేయాలనే ఆలోచనను విరమించుకొని ముందుగా ఇటువంటి అత్యవసరమైన పధకాలకు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలి. రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అల్లాడుతున్నారు. కనుక ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. అలాగే వారు ఉద్యోగాలు సంపాదించుకునే వరకు నిరుద్యోగభృతి చెల్లిస్తే అందరూ హర్షిస్తారు,” అని అన్నారు. 


Related Post