కర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వాన్ని విజయవంతంగా గద్దె దించిన ఎడ్యూరప్ప బృందానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంతవరకు బిజెపి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మళ్ళీ కొత్త డ్రామాకు రంగం సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో కర్ణాటకలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు అసంభవమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. అందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.
అధికార దాహంతో అలమటించిపోతున్న ఎడ్యూరప్పను కాదని వేరెవరికీ ముఖ్యమంత్రి పదవి అప్పగించినా ఆయన ఊరుకోరు. అలాగని ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే బిజెపిని ఖాతరు చేస్తారనే నమ్మకం లేదు. బిజెపికి ఇదొక ప్రధాన సమస్య.
ఇక బిజెపికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి 105 మంది ఎమ్మెల్యేలున్నారు. అది ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ మాత్రమే. ఆ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు బిజెపిలో మంత్రిపదవుల కోసం ఆశపడుతున్నవారు చాలా మందే ఉన్నారు కానీ వారందరికీ ఇవ్వడం కుదరదు. కనుక మొదటిరోజు నుంచే ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనివార్యం. వారిలో ఒక్కరిని కాంగ్రెస్-జెడిఎస్‌లు తమవైపుకు తిప్పుకున్నా ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. కనుక ముందుగా కనీసం మరో 5-10 ఎమ్మెల్యేలనైనా తెచ్చుకోక తప్పదు. 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చుకోవచ్చు కానీ స్పీకరు వారిపై అనర్హత వేటు వేసే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ స్పీకరును ప్రసన్నం చేసుకొని వారిని చేర్చుకున్నా వారు కూడా మంత్రిపదవులకు పోటీపడటం, దక్కకపోతే మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకోవాలనుకోవడం జరుగవచ్చు. కనుక ఇదీ ఒక సమస్యే.
తమ ప్రభుత్వాన్ని ఎడ్యూరప్ప కుట్రపన్ని కూల్చివేసినందుకు కాంగ్రెస్-జెడిఎస్‌లు ఆయనపై ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. కనుక తిరుగుబాటు ఎమ్మెల్యేలనో లేదా బిజెపి ఎమ్మెల్యేలనో లేదా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలనో తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించకమానవు. కనుక కుమారస్వామి చెప్పినట్లుగా ప్రస్తుత పరిస్థితులలో కర్ణాటకలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం అది మనుగడ సాగించడం రెండూ కష్టంగానే కనిపిస్తున్నాయి. మరి ఎడ్యూరప్పకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తే ఎలా నడిపిస్తారో చూడాలి.