వివేక్ పోరాటం సచివాలయం కోసమేనా లేక...

July 25, 2019


img

మాజీ ఎంపీ జి.వివేక్ ఏర్పాటు చేసిన ప్రజాస్వామిక తెలంగాణ వేదిక నేతృత్వంలో గురువారం ఉదయం అఖిలపక్ష నేతలు నుంచి ‘ఛలో సచివాలయం ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వారు సచివాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వివేక్ నిజంగానే సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఎందుకంటే, సచివాలయం కూల్చివేయాలనే నిర్ణయం ఈరోజు కొత్తగా తీసుకున్నది కాదు. వివేక్ తెరాసలో ఉన్నప్పుడే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పుడు వివేక్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. కనీసం దానిపై స్పందించలేదు. ఒకవేళ ఆయనకు తెరాస టికెట్ లభించి ఉండి ఉంటే నేడు తెరాసలోనే ఉండేవారు. ఉండి ఉంటే ఇటువంటి ఆలోచన కూడా చేసేవారుకారని వేరే చెప్పనవసరం లేదు. తెరాస నుంచి బయటకు వచ్చిన తరువాతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హడావుడి చేస్తున్నారు. అంటే ఆయన వేరే ఏదో ఉద్దేశ్యంతోనే ఈ పోరాటం ప్రారంభించారని అనుమానం కలగడం సహజం. 

లోక్‌సభ ఎన్నికలలో పెద్దపల్లి నుంచి పోటీచేయాలనుకున్న జి.వివేక్‌కు తెరాస టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీని వీడి బిజెపిలో చేరేందుకు సిద్దమవుతున్నారు. కనుక ఈవిధంగా బలప్రదర్శన చేసి బిజెపికి తన సత్తా చాటుకొంటూ, తాను తెరాస సర్కారును బలంగా డ్డీకొనగలనని చాటిచెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పోరాటంలో ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో రానున్న రోజులలో తేలిపోతుంది.


Related Post