కాంగ్రెస్‌ నేతలకు హనుమంతన్న చురకలు

July 24, 2019


img

ఫిరాయింపుల కారణంగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ కార్యకర్తలలో ఒకరకమైన అయోమయం నెలకొనుంది. తాము తమ నాయకుడిని అనుసరించి వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలా లేక కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకొని ఉండిపోవాలా? ఒకవేళ వేరే పార్టీలోకి వెళితే, ఇంతకాలం శత్రువులుగా ఉన్న ఆ పార్టీలో నేతలు, కార్యకర్తలు తమను దగ్గరకు రానిస్తారా లేదా? అయినా  పెద్ద పెద్ద నాయకులే వెళ్ళిపోతుంటే తమ పరిస్థితి ఏమిటి? అనే సందేహాలు సామాన్య కార్యకర్తలను వేధిస్తున్నాయి. ఆ అయోమయంలోనే వారు రాజకీయాలలో కొనసాగుతున్నారు. కానీ కాంగ్రెస్‌ నేతలెవరూ వారి సమస్యలను, ఆందోళనను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. 

ఉదాహరణకు ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జి. వివేక్ ఆ తరువాత తెరాసలో చేరారు. ఇప్పుడు బిజెపిలో చేరేందుకు సిద్దపడుతున్నారు. అటువంటి వ్యక్తితో కాంగ్రెస్‌ నేతలు ఎందుకు రాసుకుపూసుకు తిరుగుతున్నారని వి.హనుమంతరావు ప్రశ్నించారు. తద్వారా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎటువంటి సందేశం పంపుతున్నారో గ్రహించాలని సూచించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ఇతర పార్టీలు అనుసరించాలి కానీ కాంగ్రెస్‌ నేతలు ఇతర పార్టీల నేతల వెనుక తిరగడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరినవారికి కాంగ్రెస్‌ నేతలు ఎంత దూరంగా ఉంటే అంత వారికీ, కాంగ్రెస్‌ పార్టీకి కూడా మంచిదని వి.హనుమంతరావు అన్నారు. 

ఇటీవల అఖిలపక్ష నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసినప్పుడు జి.వివేక్‌ను వెంటపెట్టుకుపోయారు. అదే హన్మంతన్న ఆగ్రహానికి కారణం అయ్యుండవచ్చు.


Related Post