ప్రజాస్వామ్యం గెలిచిందా...ఓడిందా?

July 24, 2019


img

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం గద్దె దిగడంతో ప్రజాస్వామ్యం గెలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్యూరప్ప అన్నారు. అయితే కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచిందా...ఓడిందా?అంటే ఓడిందనే ఎవరైనా చెపుతారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో 105 సీట్లు గెలుచుకొని బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పుడు బిజెపికి ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్‌, జెడిఎస్ ఎమ్మెల్యేలను లోబరచుకోవచ్చుననే ధీమాతో ఎడ్యూరప్ప హడావుడిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు మొదటిసారిగా ప్రజాస్వామ్యం ఓడిపోయింది.

ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైనప్పటికీ అధికారం చేజారిపోకుండా కాపాడుకొనేందుకు, అప్పటివరకూ ఎన్నికల ప్రచారంలో దుమ్మెత్తిపోసిన జెడిఎస్ పార్టీతోనే చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు రెండవసారి ప్రజాస్వామ్యం ఓడిపోయింది. 

మొదటిసారి కాంగ్రెస్‌, జెడిఎస్ ఎమ్మెల్యేలను లోబరచుకోవడంలో విఫలమైన ఎడ్యూరప్ప ఈసారి సఫలం అవడంతో రాజ్యాంగబద్దంగా ఏర్పడిన కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మరోసారి ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఇవన్నీ కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే జరిగాయి. ఒక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పదేపదే రాజకీయాలకు బలవుతుంటే, నైతిక విలువలు మట్టిగలిసిపోతుంటే ప్రజాస్వామ్యమే గెలిచిందని ఎడ్యూరప్ప చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉంది. అంటే ఎడ్యూరప్ప గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లు లేకుంటే లేనట్లనుకోవాలేమో? 

అయితే ఇక్కడితో ఈ ప్రజాస్వామ్య విజయగాధ ముగియకపోవచ్చు. ఇక నుంచి కాంగ్రెస్‌, జెడిఎస్ నేతలు బిజెపిలో అసమ్మతి చిచ్చు రగిలించి మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఓడించే ప్రయత్నాలు చేయకమానరు. కనుక నానాటికీ కనబడకుండాపోతున్న ప్రజాస్వామ్యమంటే నేతి బీరకాయలో నెయ్యి వంటిదేనని సర్ధిచెప్పుకోకతప్పదు.


Related Post