ఒకప్పుడు పొగిడిన నోటితోనే నేడు...

July 24, 2019


img

బాబూ మోహన్...నేటికీ పరిచయం అవసరం లేని పేరు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధిగా అంధోల్ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయనకు 2018 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస టికెట్ నిరాకరించింది. నోటి దురుసు, స్థానిక తెరాస నేతలతో, అధికారులతో నిత్యం గొడవపడటం, నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోకపోవడం వంటి కారణాలతో ఆయనకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. టికెట్ నిరాకరించడంతో ఆయన అహం దెబ్బ తింది. వెంటనే బిజెపిలో చేరిపోయి మళ్ళీ అంధోల్ నుంచి పోటీ చేశారు కానీ ప్రజలు కూడా తిరస్కరించారు. ఎంతగా అంటే...డిపాజిట్ కూడా దక్కనంతగా! 

గతంలో తెరాసలో ఉన్నప్పుడు సిఎం కేసీఆర్‌ పాలన, అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ఆయన చాలా గొప్పగా పొగిడేవారు. కానీ ఇప్పుడు బిజెపిలో ఉన్నారు కనుక అదే నోటితో ఇప్పుడు అవే పధకాలలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. 

బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం టేకుమట్ల మండలంలోని వెంకట్రావ్‌పల్లికి వచ్చిన బాబు మోహన్ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ రెండు పధకాలు అవినీతికి, అక్రమాలకు అడ్డాగా మారాయి. కేవలం కమీషన్ల కోసమే సిఎం కేసీఆర్‌ ఆ రెండు పధకాలను ప్రారంభించారు. రాష్ట్రంలో తెరాస అవినీతి పాలన అంతమొందించాలంటే బిజెపి అధికారంలోకి రావలసి ఉంది. రాష్ట్రంలో తెరాసను డ్డీకొని ఓడించగల పార్టీ బిజెపి మాత్రమే. అందుకే బిజెపిలో చేరేందుకు వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకొని అధికారంలోకి వస్తాము,” అని అన్నారు.

అప్పుడు పొగిడిన పధకాలనే ఇప్పుడు బాబూ మోహన్ తప్పు పట్టడం గల్లీ స్థాయి రాజకీయమని కొట్టి పారేయవచ్చు. కానీ వాటిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఇప్పుడు చెపుతున్నారంటే అనాడు ఆయన ప్రజలకు వాటి గురించి అబద్దాలు చెప్పారనుకోవాలి. అంటే పదవి, అధికారం కోసం ఆయనే ప్రజలకు అబద్దాలు చెప్పారనుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఆనాటి మాటలు అబద్దాలు కావని చెప్పదలిస్తే, ఆ రెండు పధకాలలో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరుగలేదనుకోవలసి ఉంటుంది. సినిమాలలో నటిస్తున్నంతకాలం తెలుగు ప్రజలందరి మన్ననలు పొందిన బాబూ మోహన్, రాజకీయాలో ప్రవేశించి, అధికారం చేతికి అండగానే డిపాజిట్లు కోల్పోయేంతగా ప్రజలకు దూరం అయ్యారు. కనుక ఇకనైనా హుందాగా మాట్లాడితే మంచిదేమో.  లేకుంటే ఆయనే మరింత నష్టపోవచ్చు.


Related Post