అటవీ అధికారులు వస్తే తరిమికొట్టండి: బిజెపి ఎంపీ

July 23, 2019


img

హరితహారంలో భాగంగా కొత్త సర్సా గ్రామంలో మొక్కలు నాటడానికి వెళ్ళిన అటవీ అధికారిణి అనిత, ఆమె సిబ్బందిపై పోలీసుల సమక్షంలోనే తెరాస నేత కోనేరు కృష్ణరావు అనుచరులు దాడిచేసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అటవీ అధికారిణి, అటవీ సిబ్బందిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిని పర్యావరణ సమస్యగా భావించడం లేదని శాంతిభద్రతల సమస్యగా భావిస్తున్నామని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ లోక్‌సభలో హెచ్చరించారు. 

కానీ అదే బిజెపి పార్టీకి చెందిన అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అందుకు భిన్నంగా మాట్లాడటం విశేషం. గిరిజన నాయకుడు, తుడుం దెబ్బ వ్యవస్థాపకుడు సిద్దం శంభు వర్ధంతి సందర్భంగా మొన్న శనివారం జిల్లాలోని ఉట్నూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సోయం బాపురావు, గిరిజనులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పోడు భూములపై హక్కు మీకే ఉంటుంది. మీ భూములలో అటవీశాఖ అధికారులు ఎవరైనా మొక్కలు నాటాడానికి వస్తే వారిని తరిమికొట్టండి. వారు వేసిన మొక్కలు పీకి పారేయండి. మీ వెనుక నేనున్నాను. మీకేమి జరుగకుండా నేను చూసుకొంటాను. గిరిజనుల హక్కుల కోసం చిరకాలంగా నేను పోరాడుతున్నాను. ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వంతో కూడా పోరాడటానికి నేను సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు. 

అటవీ అధికారిణి అనితపై దాడి జరిగినప్పుడు బిజెపి ఎంపీలు తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల భూములు బలవంతంగా లాక్కొంటోందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దానిపై కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ భిన్నంగా స్పందించారు. అటవీ సిబ్బందిపై దాడులు తగవని అన్నారు. అంటే గిరిజనులను, తెరాస నేత కోనేరు కృష్ణారావును తప్పు పట్టినట్లు అర్దమవుతోంది. కానీ సోయం బాపూరావు అటవీ సిబ్బందిపై దాడులు చేయమని గిరిజనులను ప్రేరేపిస్తున్నారు. 

ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తున్నప్పుడు అడవులను నరికివేయవలసి వస్తే ఆ మేరకు మళ్ళీ విధిగా అన్ని చెట్లను పెంచాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖే షరతులు విధిస్తుంది లేకపోతే ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు నిరాకరిస్తుంటుంది. కానీ అటవీశాఖ సిబ్బంది మొక్కలు నాటేoదుకు వెళితే వారిని అడ్డుకొని తరిమికొట్టాలని బిజెపి ఎంపీ చెపుతున్నారు. ఇంతకీ దీనిపై బిజెపి వైఖరి ఏమిటో చెపితే బాగుంటుంది.


Related Post