కేసీఆర్‌ సర్కార్‌కు బిజెపి ఉచ్చు సిద్దం చేస్తోందా?

July 23, 2019


img

గతంలో అంటే గత 5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఏ సంఘటనలపై కేంద్రప్రభుత్వం పెద్దగా దృష్టి సారించేది కాదనే చెప్పవచ్చు. వాటిపై రాష్ట్ర బిజెపి నేతలు మొక్కుబడిగా విమర్శలు చేసి సరిపెట్టేసేవారు. కానీ లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించి భారీ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాలపట్ల కేంద్రప్రభుత్వ వైఖరిలో కూడా కొంతమార్పు కనబడుతోంది. 

దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు తమ తదుపరి లక్ష్యాలని బిజెపి నేతలు బాహటంగానే చెపుతున్నారు కనుక కేంద్రప్రభుత్వ వైఖరిలో తదనుగుణంగానే మార్పు వచ్చిన్నట్లు భావించవచ్చు. 

బిజెపి లక్ష్యాలలో మొట్టమొదటిదైన కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రస్తుతం జరుగుతున్న తతంగాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. నేడోరేపో బిజెపి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. తమిళనాడులో ప్రధాని నరేంద్రమోడీ మోడీ కనుసన్నలలో పనిచేసే పళనిస్వామి ప్రభుత్వం నడుస్తోంది. కనుక బిజెపి తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే అవుతుంది. అయితే అపారమైన ప్రజాధారణ కలిగిన తెరాసను ఓడించి రాష్ట్రంలో బిజెపి అధికారం చేజిక్కించుకోగలదా?అంటే దాదాపు అసంభవమేనని ఎవరైనా చెపుతారు. కనుక పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటకలలో అనుసరించిన భేదోపాయం లేదా దండోపాయం పద్దతులలోనే తెలంగాణలో కూడా అధికారం కైవసం చేసుకునేందుకు బిజెపి ప్రయత్నించవచ్చు. 

పార్లమెంటులో ఇంటర్మీడియెట్ విద్యార్దుల ఆత్మహత్యలు, అటవీశాఖ అధికారిణి అనితపై దాడి ప్రస్తావన వంటివి ఆ దిశలో జరుగుతున్న ప్రయత్నాలుగానే చూడవచ్చు. తాజాగా పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిసి తెరాస సర్కారుపై ఫిర్యాదు చేశారు. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేసి వాటి స్థానంలో కొత్త సచివాలయం, శాసనసభ, మండలి భవనాలను నిర్మించాలనుకొంటోందని, వాటి కోసం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడానికి సిద్దమవుతోందని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

జి.వివేక్ త్వరలో బిజెపిలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కనుక ఆయన ఫిర్యాదును అమిత్ షా తేలికగా కొట్టివేయకపోవచ్చు. సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత నిర్ణయంపై రాష్ట్ర బిజెపి నేతలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కనుక ఈ అంశం బిజెపికి ఆయుధంగా ఉపయోగపడవచ్చు. కనుక తెరాస సర్కార్ ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది.


Related Post