కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబమే దిక్కు!

July 22, 2019


img

“134 సం.ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ నేడు దయనీయ పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా పార్టీకి అధ్యక్షుడు లేకుండా పోయాడు. గాంధీ కుటుంబం తప్ప బయటవారెవరికి పార్టీ పగ్గాలు అప్పగించినా 24 గంటలలోనే పార్టీ నిలువునా చీలిపోవడం ఖాయం.” ఈ మాటలన్నది ఎవరో అనామక నేత కాదు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత నట్వర్ సింగ్ అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయి. ఎన్నికలలో గెలుపోటములు సహజమే. కానీ లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయినందుకు రాహుల్ గాంధీ అస్త్రసన్యాసం చేయడంతో పార్టీకి ఈ దుస్థితి కలిగింది. కనీసం తదుపరి అధ్యక్షుడి నియామకం సజావుగా సాగేందుకు ఆయన తోడ్పడినా నేడు పార్టీకి ఇటువంటి దుస్థితి వచ్చేదే కాదు. పైగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటూ తన కుటుంబానికి చెందిన వారెవరూ పార్టీ పగ్గాలు చేపట్టరాదనే షరతు విధించడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. లేకుంటే ప్రియాంకా వాద్రా ఈపాటికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఉండేవారేమో? పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొంటామని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి వారు మరికాస్త సమయం పొందేందుకే ఈ సాకు ఎంచుకున్నారని చెప్పవచ్చు. గాంధీ కుటుంబం తప్ప వేరెవరూ పార్టీ పగ్గాలు చేపట్టినా పార్టీ నిలువునా చీలిపోతుందని నట్వర్ సింగ్ చెప్పడానికి అర్ధం ఏమిటంటే, పార్టీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో అనేకమంది పోటీ పడుతున్నారని, అది దక్కకపోతే వారు పార్టీని చీల్చడానికి కూడా వెనకాడరని చెపుతునట్లు భావించవచ్చు. కనుక కాంగ్రెస్‌ నేతలందరినీ కలిపి ఉంచగల ఆ ‘ఫెవీకాల్’ గాంధీ కుటుంబం మాత్రమేనని నట్వర్ సింగ్ చెప్పకనే చెపుతున్నారనుకోవచ్చు. 


Related Post