టి-కాంగ్రెస్‌ వ్యూహం ఫలిస్తుందా?

July 22, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం, ఎమ్మెల్యేల ఫిరాయింపులతో తీవ్ర నిరాశనిస్పృహలలో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలలో మూడు స్థానాలను గెలుచుకోవడంతో మళ్ళీ తేరుకొని త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్దం అవుతోంది. 

ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా టి-కాంగ్రెస్‌ నేతలందరూ హాజరవడం విశేషం. మున్సిపల్ ఎన్నికలపై వారు లోతుగా చర్చించారు.

అనంతరం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మున్సిపల్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సీట్లకు అదనంగా మరో 50 శాతం సీట్లు బీసీలు, మైనార్టీలకు కేటాయించాలని నిర్ణయించాము. మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రమంతటా మళ్ళీ కాంగ్రెస్‌ జెండాలు ఎగురవేయగలమని పూర్తినమ్మకంతో ఉన్నాము. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధులందరూ ఫలితాలు వెలువడిన తరువాత పార్టీ ఫిరాయించబోమని, ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అఫిడవిట్ సమర్పించవలసి ఉంటుంది,” అని అన్నారు.

రాష్ట్రంలో అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బిజెపి పగటి కలలు కంటోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెరాసకు ప్రత్యామ్నాయమని ఎప్పటికైనా అధికారంలోకి వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. 

ఒకప్పుడు దేశాన్ని...సమైక్య రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ, గత ఐదున్నరేళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి తెలంగాణలో రెండవ స్థానం కోసం పోటీ పడుతుండటం ఆశ్చర్యంగానే ఉంది. రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో మున్సిపల్ ఎన్నికలలో కూడా ఘనవిజయం సాధించగలమని బిజెపి భావిస్తుంటే, ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నా నేటికీ చెక్కుచెదరని బలమైన క్యాడర్, హేమాహేమీలవంటి నేతలను చూసుకొని మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించగలమని కాంగ్రెస్‌ భావిస్తోంది. 

ఈ ఎన్నికలలో బీసీలు, మైనార్టీలకు ఎక్కువ సీట్లు కట్టబెట్టడం ద్వారా తెరాసకు చెక్ పెట్టాలనేది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఫిరాయింపులతో బలపడటం ద్వారా తెరాసను డ్డీకొనాలని బిజెపి భావిస్తోంది. మరి వాటి ఈ వ్యూహాలు ఫలిస్తాయో లేక ఈ ఎన్నికలలో కూడా ప్రజలు మళ్ళీ తెరాసకే పట్టం కడతారో చూడాలి. 


Related Post