రాయపాటి పయనం ఎప్పుడూ అధికార పార్టీవైపే...

July 22, 2019


img

రెండు తెలుగు రాష్ట్రాలలో అందరికీ సుపరిచితమైన పేరు రాయపాటి సాంబశివరావు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే దానిలో చేరిపోయి చక్రం తిప్పుతుంటారు కనుక. ఆయన రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారా లేక దశాబ్ధాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులతో ఈస్థాయికి ఎదిగారా? అంటే సమాధానం చెప్పడం కష్టమే. కానీ ఆయన రాజకీయాలు, పోలవరం కాంట్రాక్ట్ పనులతో బలంగా ముడిపడి ఉన్నాయనే దానిలో మాత్రం ఎటువంటి సందేహమూ లేదు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. రాష్ట్రవిభజన తరువాత ఏపీలో టిడిపి అధికారంలోకి రాబోతోందని పసిగట్టి దానిలో చేరిపోయి మళ్ళీ ఎంపీ అయిపోయారు. తద్వారా ఆయనకు చెందిన ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ మళ్ళీ పోలవరం కాంట్రాక్ట్ పనులు దక్కించుకోగలిగింది.

ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది గనుక ఆయన దానిలో చేరుతారని అందరూ భావించారు కానీ జగన్ ప్రభుత్వం పోలవరం పనులలో అవినీతిపై విచారణ జరపడానికి సిద్దం అవుతుండటంతో రాయపాటికి వైసీపీలో చేరే పరిస్థితి లేకుండాపోయింది. దానిపై విచారణ జరిపితే ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది కనుక తనను తాను కాపాడుకొనేందుకు బలమైన ‘రక్షణకవచం’ ఏర్పాటు చేసుకోక తప్పడం లేదు. ఆ ప్రయత్నంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరేందుకు సిద్దం అయ్యారు.

వచ్చే ఎన్నికలనాటికి ఏపీలో కూడా బిజెపి బలపడాలని కృతనిశ్చయంతో ఉంది కనుక ఆయన అవసరాన్ని గుర్తించిన బిజెపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయనకున్న అంగబలం, అర్ధబలం, రాజకీయ పలుకుబడిని బిజెపి చూస్తుంటే, కేంద్రప్రభుత్వ రక్షణకవచం కోసం ఆయన బిజెపిలో చేరుతున్నారని చెప్పవచ్చు. నేడోరేపో ఆయన బిజెపిలో చేరడం ఖాయం అయ్యింది.

కానీ ఒకవేళ వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అప్పుడు రాయపాటి మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చేయడం ఖాయం. కనుక ఆయన తన రాజకీయ, వ్యాపార మనుగడ కోసం రాజకీయ పార్టీలను మెట్లుగా ఉపయోగించుకొంటున్నారా లేక అధికారం చేజికించుకోవడం కోసం రాజకీయపార్టీలే ఆయనను ఒక బలమైన ఆయుధంగా ఉపయోగించుకొంటున్నాయా? అనే ప్రశ్నకు ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పుకోవచ్చు. 


Related Post