భూపతిరెడ్డి అనర్హుడే: హైకోర్టు

July 17, 2019


img

కాంగ్రెస్ పార్టీలో చేరిన తెరాస ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేయడం సమంజసమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కనుక తెరాస ఫిర్యాదు మేరకు మండలి ఛైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఆయన నిర్ణయాన్ని సవాలు చేస్తూ భూపతి రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన యాదవ్ రెడ్డి, రాములు నాయక్ పిటిషన్లు వేయగా హైకోర్టు వారిరువురి పిటిషన్లు ఇదివరకే కొట్టివేసింది. వారిరువురూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోబోతున్నారు. భూపతిరెడ్డిపై అనర్హత కేసుపై హైకోర్టు స్పందిస్తూ, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లోని 8వ సెక్షన్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్‌లకు సభ్యులపై అనర్హత విధించే అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

తెరాస ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరితే ఇంత వేగంగా వారిపై చర్యలు తీసుకున్న ఛైర్మన్, అదే...తెరాసలో చేరిన 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ నేతలు ఎంతగా కోరినప్పటికీ స్పీకరు పట్టించుకోవడం లేదు. ఈ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలను కలిసేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. అదే సమయంలో తమను తెరాసలో విలీనం చేయాలని లేఖ ఇవ్వడానికి వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా క్షణాలలో వారి అభ్యర్ధనను ఆమోదించేశారు కూడా. తెరాస ద్వందవైఖరిని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. కానీ తెరాస కూడా వారి విమర్శలను పట్టించుకోవడం లేదు. 


Related Post