కుమారస్వామి ప్రభుత్వానికి రేపే చివరి రోజు?

July 17, 2019


img

కర్ణాటకలో గత మూడువారాలుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రేపు ముగింపువచ్చే అవకాశం కనబడుతోంది. కాంగ్రెస్‌, జెడిఎస్ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరించింది. 

15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది స్పీకరు పరిధిలో ఉన్న అంశం కనుక దానిలో తాము జోక్యం కలిగించుకోలేమని, కనుక నిర్ధిష్ట వ్యవధిలో వారి రాజీనామాలను ఆమోదించాలని స్పీకరును ఆదేశించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ స్పష్టం చేశారు. రేపు శాసనసభలో జరుగబోయే బలపరీక్షకు హాజరుకావాలా వద్దా.. అనేది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టమని వారిని హాజరుకమ్మని బలవంతం చేయలేమని చెప్పారు. 

కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లున్న సుప్రీంకోర్టు తీర్పు అంతిమంగా బిజెపికి మేలు చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. స్పీకరు పరిధిలో ఉన్న ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, వారిపై అనర్హత వేటువేసినా, వారి రాజీనామాలు ఆమోదించినా నష్టపోయేది కాంగ్రెస్‌-జెడిఎస్ ప్రభుత్వమే. రెబెల్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం విప్ జారీ చేసినప్పటికీ వారు రేపు శాసనసభలో జరుగబోయే బలపరీక్షకు హాజరుకానవసరం లేదన్నట్లు సుప్రీంకోర్టు చెప్పినందున వారు రేపు సభకు హాజరుకాకపోవచ్చు. 

అప్పుడు సభలో సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. అప్పుడు ప్రభుత్వం నిలబడేందుకు లేదా కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు 105 మంది సభ్యుల మద్దతు అవసరమవుతారు. 15 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌-జెడిఎస్ బలం 101కి పడిపోగా, బిజెపి బలం 105 ఉంది. రాష్ట్రంలో మారిన రాజకీయ బలాబలాల నేపద్యంలో మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో సహ మరికొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతు పలికే అవకాశం ఉంది. అంటే కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవడం, యెడ్యూరప్ప మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు సిఎం కుమారస్వామి తమ ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకు గవర్నర్ అంగీకరిస్తే కర్ణాటకలో మళ్ళీ ఎన్నికలు తప్పకపోవచ్చు. కానీ గవర్నర్‌ కూడా కేంద్రప్రభుత్వం (బిజెపి) చేత నియమింపబడినవారే కనుక కుమారస్వామి ప్రతిపాదనను తిరస్కరించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపజేసి కొన్ని రోజుల తరువాత రాష్ట్రంలో బిజెపి అధికారం చేజిక్కించుకునేందుకు సహకరించవచ్చు. 


Related Post