ఓటమికి బిజెపి ముందే సాకులు సిద్దం చేసుకొంటోందా?

July 16, 2019


img

ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపద్యంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వాటి నిర్వహణపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఒకవేళ లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు కలిపి వెళ్ళి ఉండి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవని ఖచ్చితంగా చెప్పగలను. వాటి తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు హడావుడిగా జరిపించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా హడావుడిగా జరిపించడానికి సిద్దం అవుతున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా హడావుడిగా ఎన్నికలు జరిపించి తెరాసను గెలిపించుకోవాలని సిఎం కేసీఆర్‌ ఆలోచన కావచ్చు. కానీ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బిజెపి ఘనవిజయం సాధించడం ఖాయం. బిజెపి అన్ని జిల్లాలలో అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది,” అని అన్నారు.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినందునే తెరాసకు ఘనవిజయం సాధించిందన్న మాట వాస్తవం.  అదే...ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడంతో ఘోరంగా ఓడిపోయింది. లోక్‌సభ ఎన్నికలలో కూడా తెరాస మంచిఫలితాలనే రాబట్టగలిగింది. ఏ రాజకీయపార్టీకైనా ఎన్నికలలో గెలుపే దాని సామార్ద్యానికి, శక్తియుక్తులకు నిదర్శనంగా భావించబడుతుంది. కనుక ఎన్నికల విషయంలో సిఎం కేసీఆర్‌ కూడికలు, తీసివేత లెక్కలు, అంచనాలు నూటికి నూరు శాతం ఫలించాయని స్పష్టం అవుతోంది.

కానీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి మాత్రం ఒకే ఒక సీటు గెలుచుకోగలిగింది. జాతీయస్థాయిలో తిరుగులేని విజయం సాధించిన బిజెపి, రాష్ట్ర స్థాయిలో ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయిందో బిజెపి నేతలు ఆత్మవిమర్శ చేసుకున్నారో లేదో తెలియదు కానీ లోక్‌సభ ఎన్నికలలో 4 సీట్లు గెలుచుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో తెరాసకు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయమని గొప్పలు చెప్పుకొంటున్నారు. వారికి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల రూపంలో మరో అగ్నిపరీక్ష ఎదుర్కోవలసి వస్తోంది. వారు చెప్పుకొంటునట్లుగా నిజంగానే రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు బిజెపివైపే చూస్తుండటం నిజమైతే, మున్సిపల్ ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించవలసి ఉంటుంది. కనీసం గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోవలసి ఉంటుంది లేకుంటే సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలలో బిజెపి గెలుపు యాక్సిడెంటల్‌ గెలుపుగా భావించవలసి ఉంటుంది.

ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికలలో బిజెపి పరిస్థితిని గమనించినట్లయితే త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా బిజెపికి అటువంటి ఫలితాలే పునరావృతం కావచ్చు. ఈ సంగతి కె.లక్ష్మణ్ కూడా గ్రహించినట్లే ఉన్నారు. అందుకే బిజెపి ఓటమికి ముందే సాకును సిద్దం చేసుకునే ప్రయత్నంలో భాగంగా సిఎం కేసీఆర్‌ హడావుడిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారేమో. అయితే ఇటువంటి ప్రత్యక్ష ఎన్నికలలో బిజెపి విజయం సాధించగలిగిననాడే, దానికీ ప్రజాధారణ ఉందని కనుక రాష్ట్రంలో ఎప్పటికైనా తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది. మరి రాష్ట్ర బిజెపి నేతలు ప్రజలకు ఆ నమ్మకం కలిగించగలరా?


Related Post