బిజెపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందట!

July 13, 2019


img

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ సికింద్రాబాద్‌లో ఇతర పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి బిజెపిలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచిన బిజెపిలో చేరేందుకు అన్ని వర్గాల ప్రజలు తరలివస్తున్నారు. సిఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తూ, హామీలతో కాలక్షేపం చేస్తున్నారు తప్ప గత ఎన్నికల హామీలైన ఉద్యోగాల కల్పన, కేజీ టు పీజీ ఉచిత విద్య వంటి హామీలను ఇంతవరకు అమలుచేయలేదు. కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి. కనుక తెలంగాణ ప్రజలందరూ బిజెపి వైపే చూస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబపాలనను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో బిజెపికి పట్టం కట్టబోతున్నారు,” అని అన్నారు.

దేశంలో ప్రజలెన్నుకొన్న బిజెపియేతర ప్రభుత్వాలను ఒకటొకటిగా కూల్చివేస్తున్న బిజెపి ప్రజాస్వామ్య విలువలు, దాని రక్షణ గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. బిజెపి అధికార దాహానికి కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా కళ్లెదుట కొనసాగుతూనే ఉంది. ఎన్నికలలో పోటీ చేసి ప్రజాస్వామ్యబద్దంగా గెలిచి అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు చెప్పుకుంటే చాలా గౌరవంగా, హుందాగా ఉంటుంది. కానీ కొందరు బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్ని నెలల గడువులోగా కూలిపోతాయని హెచ్చరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కోల్‌కతాలో ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు బిజెపితో టచ్చులో ఉన్నారని, మమతా బెనర్జీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునన్నట్లు మాట్లాడటం ఒకసారి గుర్తుచేసుకుంటే, ప్రజాస్వామ్యానికి బిజెపి ఎంత గౌరవం ఇస్తోందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణలో బిజెపికి బలం లేకపోయినప్పటికీ అధికారంలో వస్తామని చెప్పుతున్నారంటే అర్ధం ఏమిటి?


Related Post