నేడు టిజేఎస్‌ తొలి ప్లీనరీ...భవిష్యత్ ఏమిటో?

July 13, 2019


img

ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన ఏర్పదినా తెలంగాణ జనసమితి ఈరోజు తొలి ప్లీనరీ సమావేశాన్ని హైదరాబాద్‌లో జరుపుకొంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్య అతిధిగా స్వరాజ్ అభియాన్ పార్టీ నేత యోగేంద్రనాథ్ వచ్చారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యకార్యాచరణ గురించి లోతుగా చర్చించారు. ప్రస్తుతం డబ్బు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రజలు కేంద్రంగా నడిచే రాజకీయాలు రావాలని కోరుకొంటున్నానని కోదండరాం చెప్పారు. అందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు గట్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా టిజేఎస్‌ 6 తీర్మానాలను చేసి ఆమోదించింది. 

1. తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ బేషరతుగా తక్షణమే ఎత్తివేయాలి. 

2. హైదరాబాద్‌ నగరంలో అమరవీరులకు స్మృతివనం నిర్మించాలి. 

3. జూన్ 2వ తేదీని అమరవీరుల దినోత్సవంగా ప్రకటించి, ఆ రోజున ఉద్యమకారులను సన్మానించాలి. 

4. తెలంగాణ సాధాన కోసం జరిగిన పోరాటాల గురించి భావి తరాలు తెలుసుకునేందుకు వీలుగా ఒక మ్యూజియం నిర్మించాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రను విద్యార్దులకు పాఠ్యాంశంగా చేయాలి. 

5. వ్యవసాయాభివృద్ధికి సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలి. 

6. రాష్ట్ర బడ్జెట్‌లో 20 శాతం వ్యవసాయానికి కేటాయించాలి.  

ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు వినిపించడానికి టిజేఎస్‌ వంటి పార్టీలు అవసరమే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ వంటి అతిపెద్ద పార్టీయే తెరాస దెబ్బకు డీలా పడిపోయింది. ఆ తెరాసను దెబ్బ తీయడానికి ఇప్పుడు బిజెపి సిద్దం అవుతోంది. ఎంతో శక్తివంతమైన ఈ మూడు పార్టీల జరుగుతున్న ఆధిపత్యపోరులో టిజేఎస్‌ నిలద్రొక్కుకొని నిలిచి ఉండటమే కష్టం. ఇక తన ఆశయసాధన కోసం అధికారంలోకి రావడం దాదాపు అసంభవమేనని అందరికీ తెలుసు. కనుక టిజేఎస్‌ ముందుగా తన భవిష్యత్...కార్యాచరణ గురించి ఆలోచించుకుంటే మంచిదేమో.


Related Post