కళ్లెదుట సాక్షాత్కరించిన కాళేశ్వరం కల

July 13, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో అందరికీ తెలుసు. ప్రతిపక్షాల కోర్టు కేసులు, కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవడం, హైకోర్టును, రైతులను ఒప్పించి భూసేకరణ చేయడం, క్లిష్టమైన సొరంగాల తవ్వకం పనులు, భూగర్భపంప్‌హౌస్‌ల నిర్మాణం, వాటి కోసం విదేశాల నుంచి భారీ మోటర్లను దిగుమతి చేసుకోవడం, వాటికి అవసరమైన సాంకేతికజ్ఞానం సమకూర్చుకోవడం, అనుకొన్న సమయానికి పనులు పూర్తి చేయడం, అన్నిటికీ మించి ఈ నిర్మాణపనులకు వేలకోట్ల పెట్టుబడి సమకోర్చుకోవడం....ఇన్ని సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం కేవలం 3 ఏళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానఘట్టాన్ని పూర్తిచేసి చెప్పినట్లుగానే నేడు నీటిని విడుదల చేస్తోంది. 

శుక్రవారం నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌లో నాలుగు పంపులు నిర్విరామంగా నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఆ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం జలాశయంలోకి చేరుతుండటంతో ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 113.4 మీటర్లకు చేరింది. మరో రెండు మీటర్లు పెరిగితే, అక్కడి నుంచి కాసిపేట వద్ద అన్నారం పంప్‌హౌస్‌కు చేరుకుంటాయి. అక్కడకు నీళ్ళు చేరుకోగానే బ్యారేజీ గేట్లు మూసివేసి ఆ నీటిని భారీ మోటార్ పంపులతో సుందిళ్ళ బ్యారేజిని నింపడం మొదలుపెడతారు. ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు తరలివస్తోంది. దీంతో ముందు అనుకొన్నట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులో సిద్దమైన అన్ని పంప్‌హౌస్‌లను పూర్తిస్థాయిలో పనిచేయించి నీటిని ఎత్తిపోసుకోవడానికి వీలుపడుతోంది.


ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజిలోని 85 గేట్లను మూసివేసి నీటిని నిలువచేస్తుండటంతో అక్కడ 4 టీఎంసీల నీళ్ళు నిలువ అయ్యాయి. దాంతో బ్యాక్ వాటర్స్ పెద్దపల్లి జిల్లా మంథనికి చేరాయి. అలాగే అన్నారం బ్యారేజీకి భారీగా నీటిని ఎత్తిపోస్తుండటంతో మంథని మండలం విలోచవరం వరకు 22 కిమీ పొడవునా నీళ్ళు పరుచుకొని కళ్ళకు ఇంపుగా కనబడుతుంటే గలగలపారుతూ తమ గ్రామాలకు తరలివస్తున్న గోదారమ్మను చూసి పల్లెప్రజలు ఆనందంతో పొంగిపోతున్నారు. నిన్న తొలి ఏకాదశి కావడంతో ప్రజలు ఆ నీళ్ళలో దిగి పుణ్యస్నానాలు ఆచరించి పసుపు కుంకుమలతో నదీమతల్లికి సంతోషంగా, భక్తిగా పూజలు చేశారు.


Related Post