ముంబై జోరువాన్నలో కన్నడ డ్రామా

July 10, 2019


img

ఒకపక్క ముంబైవాసులు భారీ వర్షాల కారణంగా అల్లాడిపోతుంటే, మరోపక్క ముంబైలో బస చేసిన 11 మంది కాంగ్రెస్‌, ఇద్దరు జెడిఎస్ కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేలు రసవత్తరమైన నాటకం ప్రదర్శిస్తున్నారు. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని కనుక భద్రత కల్పించవలసిందిగా ముంబై పోలీస్ కమీషనరుకు ఒక లేఖ వ్రాయడంతో వారు బస చేసిన హోటల్ చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కర్ణాటక సీనియర్ కాంగ్రెస్‌ నేత శివశంకర్ వారిని కలిసి నచ్చజెప్పి వారిని మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేర్చేందుకుగాను  బెంగళూరు నుంచి ముంబైకు చేరుకున్నారు. కానీ పోలీసులు ఆయనను హోటల్ లోపలకి అనుమతించలేదు. హోటల్లో బస చేసిన ఎమ్మెల్యేలు ఆయనను కలవడానికి అంగీకరిస్తేనే లోపలకు అనుమతిస్తామని చెప్పడంతో శివశంకర్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ మారణాయుధాలతో లోపలకు ప్రవేశించడంలేదని, లోపల బస చేసినవారందరూ తన మిత్రులేనని వారిని కలిసేందుకు వెళుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకొంటున్నారని ప్రశ్నించారు. కానీ పోలీసులు ఆయనను లోపలకు అనుమతించకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. 

ప్రస్తుత సంక్షోభానికి బిజెపియే కారణమంటూ రాహుల్ గాంధీతో కాంగ్రెస్‌ ఎంపీలు లోక్‌సభలో మంగళవారం నినాదాలతో హోరెత్తించారు. కానీ కాంగ్రెస్-జెడిఎస్ పార్టీలలో అంతర్గతంగా సంక్షోభం జరిగితే దానితో తమకు సంబందం అంటగట్టడం సరికాదని బిజెపి వాదిస్తోంది. అయితే ఒకవేళ కాంగ్రెస్‌-జెడిఎస్ కూటమి ఈ సంక్షోభం నుంచి వీలైనంత త్వరగా బయటపడలేకపోతే, రాష్ట్రంలో తాము ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సిద్దంగా ఉన్నామని కర్ణాటక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎడ్యూరప్ప చెపుతుండటం విశేషం. 

రోజులు గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్-జెడిఎస్ పార్టీల ఎమ్మెల్యేలు ఒకరొకరుగా చేజారిపోతుండటంతో సిఎం కుమారస్వామికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. మరికొన్ని రోజులు ఇవే పరిస్థితులు కొనసాగినట్లయితే, (బిజెపికి అనుకూల పరిస్థితులు ఏర్పడేవరకు) రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ కేంద్రానికి సిఫార్సు చేసినా ఆశ్చర్యం లేదు.


Related Post